వక్ఫ్ ఆస్తులు.. ముస్లిం సమాజ ఊపిరి
ప్రాణాలు పణంగా పెట్టి రక్షించుకుంటాం ముస్లిం సంఘాల నేతలు డిమాండ్
లబ్బీపేట(విజయవాడతూర్పు): వక్ఫ్ ఆస్తులు ముస్లిం సమాజానికి ఊపిరి లాంటివని, ప్రాణాలు పణంగా పెట్టయినా వాటిని రక్షించుకుంటామని పలు ముస్లిం సంఘాల నేతలు పేర్కొన్నారు. కేంద్ర మైనార్టీ శాఖ మంత్రి కిరణ్ రిజుజు డిసెంబరు 5 లోగా వక్ఫ్ ఆస్తులను వెబ్‌సైట్‌లో నమోదు చేసుకోవాలని విధించడం అన్యాయమని, ఇంత తక్కువ సమయంలో నమోదు అసాధ్యమని వారు పేర్కొన్నారు. లబ్బీపేటలోని అల్ మునీర్ ఫౌండేషన్ కార్యాలయంలో సోమవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ముస్లి జేఏసీ రాష్ట్ర కన్వీనర్ మునీర్ అహ్మద్ షేక్ మాట్లాడుతూ ముస్లిం సమాజానికి ప్రమాదం పొంచి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. మైనారిటీల ఆస్తుల నమోదులో తీవ్రమైన సాంకేతిక సమస్యలను సత్వరం రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించాలని కోరారు.
ఆస్తుల నమోదు గడవు పొడింగించాలి..
ఏప్రిల్ 2025 బిల్లు రూపొందిన నాటికి వక్ఫ్ జాబితాలో చేరి ఉన్న భూములన్నిటిని తిరిగి వక్ఫ్ ’ఉమీద్ పోర్టల్’ లో చేర్చాలని, ప్రతి ఆస్తి వాటి హద్దులు వైశాల్యం ,ప్రాపర్టీ ఫోటోలు, వక్ఫ్ బోర్డు ఇన్‌స్పెక్టర్ సహాయంతో ముజావర్లు, సంరక్షణ చేసే బాధ్యులు, ప్రతి ఆస్తిని డిసెంబర్ 5 , 2025 లోగా నమోదు చేయాలని కేంద్రం డెడ్ లైన్ విధించిందన్నారు. కేవలం 2 వారాల్లో వక్ఫ్ నమోదు కాల పరిమితి ముగుస్తుందని, రాష్ట్రంలో దాదాపు 65 వేల ఎకరాలు వక్ఫ్ భూములు ఉన్నాయి. అందులో 4748 సంస్థలు వక్ఫ్ బోర్డు గెజిట్‌లో నమోదై ఉన్నాయని, వాటన్నిటినీ యథాతథంగా తిరిగి ఉమీద్ పోర్టల్‌లో నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో జామియాత్ అహిలే హదీస్ ప్రతినిధి మౌలానా నసీర్ ఉమ్రి, జమాతే ఇస్లామీ హింద్ ప్రతినిధి మొహమ్మద్ లుక్మాన్, ముస్లిం పర్సనల్ లా బోర్డు ప్రతినిధులు ముఫ్తి యూసఫ్ అలి తదితరులు పాల్గొన్నారు.


