బూడిద లారీలను అడ్డుకొని లారీ ఓనర్ల నిరసన
జి.కొండూరు: ఇబ్రహీంపట్నం వీటీపీఎస్ బూడిద లోడింగ్ వ్యవహారంలో బూడిద ప్రభావిత గ్రామాలకు లోడింగ్ చేసిన ధరకే తమకు లోడింగ్ చేయాలంటూ జి.కొండూరు, మైలవరం మండలాల పరిధిలోని లారీల ఓనర్లు సోమవారం నిరసన వ్యక్తం చేశారు. చెవుటూరు గ్రామ శివారులోని ముప్‌పైవ నంబరు జాతీయ రహదారిపై బూడిద లారీలను అడ్డుకున్నారు. వీటీపీఎస్ బూడిద రవాణాను ఇటీవల ప్రైవేటు సంస్థలకు అప్పగించిన నేపథ్యంలో తమకు ఉచిత లోడింగ్ చేయాలంటూ ఇబ్రహీంపట్నంలో బూడిద చెరువు ప్రభావిత గ్రామాల లారీల ఓనర్లతో పాటు మైలవరం, జి.కొండూరు మండలాల పరిధిలోని 60 లారీల ఓనర్లు సైతం నెల రోజులపాటు నిరాహార దీక్షలో పాల్గొన్నారు. ఈ క్రమంలో లారీకి లోడింగ్ చార్జీ చెల్లించి రవాణా చేసుకునేందుకు కాంట్రాక్టరు ఒప్పుకోవడంతో ప్రభావిత గ్రామాల లారీలతో పాటు కాంట్రాక్టరుకు చెందిన లారీల ద్వారా బూడిద రవాణా కొనసాగుతోంది. అయితే తాము కూడా నిరాహార దీక్షలో పాల్గొంటే తమకు ఉచిత లోడింగ్ లేకుండా ప్రభావిత గ్రామాల లారీలకు మాత్రమే ఉచిత లోడింగ్ చేయడం దుర్మార్గమని, ప్రభావిత గ్రామాల లారీ ఓనర్లను నమ్మి దర్నాలో పాల్గొని తాము మోసపోయామని మైలవరం, జి.కొండూరు మండలాల లారీల ఓనర్లు నిరసనకు దిగారు. తాము కాంట్రాక్టరు నిర్ణయించిన ధరకు రవాణా చేయడం వల్లన నష్టపోతున్నామంటూ తమకు కూడా బూడిద ప్రభావిత గ్రామాల లారీ ఓనర్లకు ఇచ్చిన మినహాయింపుతోనే లోడింగ్ చేయాలంటూ జి.కొండూరు, మైలవరం మండలాల పరిధిలోని లారీ ఓనర్లు బూడిద లారీలను అడ్డుకున్నారు. లారీల ఓనర్లకు సీఐటీయూ నాయకులు మద్దతుగా నిలిచారు. జాతీయ రహదారిపై వివాదం చెలరేగడంతో ట్రాఫిక్ సమస్య తలెత్తే అవకాశం ఉన్నందున జి.కొండూరు పోలీసులు రంగంలోకి దిగి లారీల ఓనర్లను అదుపులోకి తీసుకోవడంతో నిరసన కార్యక్రమానికి తెరపడింది.


