అన్నదాతల సాధికారతకు రైతన్నా.. మీకోసం
డిసెంబర్ 2 వరకు నిర్వహణ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): అన్నదాతల సాధికారతే లక్ష్యంగా డిసెంబర్ 2వ తేదీ వరకు ‘‘రైతన్నా మీకోసం.. కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ తెలిపారు. సోమవారం వ్యవసాయ, వివిధ శాఖల అధికారులతో కలిసి కలెక్టర్ కార్యాలయంలో ఆయన ‘రైతన్నా మీకోసం’ పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ కార్యక్రమం ద్వారా అన్ని రైతు సేవా కేంద్రాల పరిధిలో రైతు సేవా కేంద్రం సిబ్బంది, వ్యవసాయ అనుబంధ శాఖలు, శాస్త్రవేత్తల సమన్వయంతో ఇంటింటికి వెళ్ళి రైతులను ప్రత్యక్షంగా కలుస్తారన్నారు. ముఖాముఖి చర్చ నిర్వహిస్తారన్నారు. నీటి భద్రత, డిమాండ్ ఆధారిత పంటల సాగు, వ్యవసాయంలోకి సాంకేతికతను చొప్పించడం, పండించిన పంటల విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీ వంటివి సాధించడానికి ప్రభుత్వం నుంచి అన్నదాత సుఖీభవ– పిఎం కిసాన్, రాయితీపై విత్తనాలు లాంటి తదితర ఆర్ధిక మద్దతు కల్పించడం వంటి అంశాల గురించి ప్రతీ రైతుకు తెలియజేయాలన్న సంకల్పంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు చెప్పారు. కార్యక్రమం ద్వారా వ్యవసాయంతో పాటు, ఉద్యాన పంటల సాగు విస్తీర్ణం పెంచడం, ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించడం, సమర్థ నీటి వినియోగానికి ప్రతి నీటిబొట్టును సద్వినియోగ పరచడానికి బిందు సేద్యాన్ని ప్రోత్సహించడం, వ్యవసాయ యాంత్రీకరణలో భాగంగా రాయితీపై కంబైన్డ్ హార్వెస్టర్లు మరియు డ్రోన్లను అందించడం, ధాన్యం కొనుగోలు చేయడం, పంటల సాగులో కృత్రిమ మేధస్సును ఉపయోగించడం ద్వారా మరింత కచ్చితమైన సమాచారంతో చీడపీడల నుండి నష్ట నివారణ, తద్వారా ఖర్చులు తగ్గించడం, చేపల రొయ్యల పెంపకందార్లకు రాయితీపై విద్యుత్ సరఫరా, ప్రతి నియోజకవర్గంలో రైతు బజార్లు, పట్టణ ప్రాంతంలో మొబైల్ రైతుబజార్లు ఏర్పాటు చేయడం లాంటి ప్రభుత్వం అందించే వివిధ ప్రోత్సాహాలను రైతులకు తెలియజేయడం జరుగుతుందన్నారు.


