ఎన్టీఆర్ జిల్లా పోలీస్ గ్రీవెన్స్‌కు 69 ఫిర్యాదులు
లబ్బీపేట(విజయవాడతూర్పు): ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ కార్యాలయంలో సోమవారం జరిగిన గ్రీవెన్స్ కార్యక్రమంలో ప్రజల నుంచి 69 ఫిర్యాదులు అందాయి. పోలీస్ కమిషనర్ ఎస్‌వి రాజశేఖరబాబు ఆదేశాల మేరకు డీసీపీ ఏబీటీఎస్ ఉదయరాణి ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. నడవలేని వికలాంగులు, వృద్ధుల వద్దకే వెళ్లి ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్భంగా భూ వివాదాలు, ఆస్తి వివాదాలు, నగదు లావాదేవీలపై 31, భార్యాభర్తలు, కుటుంబ కలహాలవి 06, కొట్లాటలు 03, వివిధ మోసాలపై 04, మహిళా సంబంధిత నేరాలపై 05, దొంగతనాలు 04, చిన్న వివాదాలు, ఘటనలపై 16 ఫిర్యాదులు అందాయి.
రైల్వే స్టేడియంలో
ఘనంగా పారా స్పోర్ట్స్ మీట్
రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): డిసెంబర్ 3న అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకుని విజయవాడ డివిజన్‌లోని రైల్వే స్టేడియంలో సోమవారం పారా స్పోర్ట్స్ మీట్‌ను నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన పలు క్రీడా పోటీల్లో డివిజన్‌లోని దివ్యాంగ ఉద్యోగులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఏడీఆర్‌ఎం పి.ఈ ఎడ్విన్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిబ్బందిలో ఆత్మసైర్ధ్యం, పట్టుదల, సాధికారితను పెంపొందించడంలో భారతీయ రైల్వే నిబద్దత కలిగి ఉందని తెలిపారు. ఇటువంటి పారా క్రీడల్లో పాల్గొడం ద్వారా వారిలో ఐక్యత, సమాన అవకాశాలు పెరుగుతాయన్నారు.


