దసరాలో పరిమితంగానే ఆర్జిత సేవలు | - | Sakshi
Sakshi News home page

దసరాలో పరిమితంగానే ఆర్జిత సేవలు

Aug 21 2025 6:38 AM | Updated on Aug 21 2025 6:38 AM

దసరాలో పరిమితంగానే ఆర్జిత సేవలు

దసరాలో పరిమితంగానే ఆర్జిత సేవలు

దసరాలో పరిమితంగానే ఆర్జిత సేవలు

ఉత్సవ ఏర్పాట్లపై దేవదాయ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి సమీక్ష

దుర్గా ఘాట్‌లో మరింత వైభవంగా కృష్ణమ్మ హారతులకు ఏర్పాట్లు

టీటీడీ సహకారంతో అమ్మవారి ఆలయ బంగారు తాపడం పనులు

కుమ్మరిపాలెంలో టీటీడీ స్థలాన్ని దుర్గగుడికి తీసుకునేందుకు చర్చలు

ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): అమ్మవారి సన్నిధిలో జరిగే ఉత్సవాలు అంటేనే పూజలకు ఓ ప్రత్యేకత ఉంటుంది. అసలు పూజలు లేకుండా ఉత్సవాలు ఏంటి...అయితే అన్ని పూజలు కలిపి 3 వేలకు అటు ఇటుగా పెట్టండి అంటూ దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి దుర్గగుడి అధికారులను ఆదేశించారు. శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో సెప్టెంబర్‌ 22వ తేదీ నుంచి అక్టోబర్‌ 2వ తేదీ వరకు నిర్వహించే దసరా మహోత్సవాల ఏర్పాట్లపై బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. బ్రాహ్మణ వీధిలోని జమ్మిదొడ్డి ఆవరణలో బోర్డు మీటింగ్‌ హాల్‌లో సమీక్ష సమావేశం నిర్వహించగా, దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, జిల్లా కలెక్టర్‌ లక్ష్మీశ, విజయవాడ పోలీస్‌ కమిషనర్‌ రాజశేఖర్‌బాబు, మున్సిపల్‌ కమిషనర్‌ ధ్యానచంద్‌, పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి, దేవదాయ శాఖ కమిషనర్‌ రామచంద్రమోహన్‌, దుర్గగుడి ఈవో శీనా నాయక్‌తో పాటు వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన ముఖ్య అధికారులు హాజరయ్యారు. సమీక్ష సమావేశంలో దసరా ఉత్సవాల ఏర్పాట్లు, భక్తులకు కల్పిస్తున్న సదుపాయాలు, గతంలో చోటు చేసుకున్న పలు అంశాల గురించి వీడియో ప్రజెంటేషన్‌ జరగ్గా, ఆ తర్వాత ఈ ఏడాది చేస్తున్న ఏర్పాట్లు, ఇతర మౌలిక సదుపాయాలపై చర్చ సాగింది. అయితే ప్రధానంగా ఈ ఏడాది ఆర్జిత సేవలను పరోక్షంగా నిర్వహించాలని దేవదాయ శాఖ చేసిన ప్రతిపాదనకు దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో నిర్వహించే దసరా ఉత్సవాలు అంటేనే ఇంద్రకీలాద్రి గుర్తుకు వస్తుందని, అటువంటిది ఆర్జిత సేవలు లేకుండా ఉత్సవాలు ఏంటని ప్రశ్నించారు. అయితే ప్రత్యేక ఖడ్గమాలార్చన, చండీహోమం, లక్ష కుంకుమార్చన, శ్రీచక్ర నవార్చనలన్నీ కలిపి మూడు నుంచి మూడున్నర వేల టికెట్లు భక్తులకు అందు బాటులో ఉండేలా ఏర్పాట్లు చేయాలని సూచించారు. గత ఏడాది దసరా ఉత్సవాల వీడియో ఫుటేజీలను పరిశీలించిన మంత్రి, దేవాదాయ శాఖ అధికారులు కొన్ని కీలక అంశాల గురించి చర్చించారు. దుర్గాఘాట్‌లో నిర్వహిస్తున్న కృష్ణమ్మ హారతులను మరింత వైభవంగా నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నామని, కుమ్మరి పాలెంలోని టీటీడీకి చెందిన రెండున్నర ఎకరాల స్థలాన్ని దుర్గగుడికి ఇచ్చేందుకు కొన్ని ఇబ్బందులు ఉన్నాయని, వాటి గురించి టీటీడీతో మాట్లాడినట్టు మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు. అమ్మవారి ఆలయ బంగారు తాపడం పనులను టీటీడీ సహకారంతో త్వరలోనే చేపట్టేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు. సమావేశంలో దేవస్థాన స్థానాచార్య శివప్రసాద్‌ శర్మ, ప్రధాన అర్చకుడు ఎల్‌డీ ప్రసాద్‌, వైదిక కమిటీ సభ్యులు కోట ప్రసాద్‌, శ్రీధర్‌ ఇతర అధికారులు పాల్గొన్నారు.

మీడియా సమావేశం లేకుండానే ముగింపు

దుర్గగుడిలో జరిగే దసరా ఉత్సవాల ఏర్పాట్లపై నిర్వహించిన సమీక్ష సమావేశానికి మీడియాకు ఆహ్వానం లేదని సిబ్బంది బహిరంగంగా పేర్కొనడం గమనార్హం. గతంలో ఎన్నడూ లేని విధానానికి దుర్గగుడి అధికారులు తెర లేపారు. సమీక్ష సమావేశం ముగిసిన తర్వాత దేవస్థానమే ఫొటోలు, వీడియోలు పంపుతుందని ముందుగానే మీడియా ప్రతినిధులకు సమాచారం అందించారు. కనీసం సమీక్ష సమావేశం హాల్‌ వద్దకు కూడా మీడియా ప్రతినిధులు రాకుండా కట్టుదిట్టంగా ఏర్పాట్లు చేశారు. సుమారు రెండున్నర గంటల పాటు సాగిన సమీక్ష సమావేశ వివరాలను రెండు ముక్కల్లో తేల్చివేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement