గూడూరు–విజయవాడ సెక్షన్‌లో డీఆర్‌ఎం తనిఖీలు | - | Sakshi
Sakshi News home page

గూడూరు–విజయవాడ సెక్షన్‌లో డీఆర్‌ఎం తనిఖీలు

Aug 21 2025 6:38 AM | Updated on Aug 21 2025 6:38 AM

గూడూర

గూడూరు–విజయవాడ సెక్షన్‌లో డీఆర్‌ఎం తనిఖీలు

గూడూరు–విజయవాడ సెక్షన్‌లో డీఆర్‌ఎం తనిఖీలు తండ్రి మందలించాడని యువకుడు ఆత్మహత్య గుర్తు తెలియని వ్యక్తి మృతి రోడ్డు ప్రమాదంలో పండ్ల వ్యాపారి మృతి

రైల్వేస్టేషన్‌(విజయవాడపశ్చిమ): విజయవాడ రైల్వే డీఆర్‌ఎం మోహిత్‌ సోనాకియా బుధవారం గూడూరు–విజయవాడ సెక్షన్‌లో విస్తతంగా తనిఖీలు చేపట్టారు. నెల్లూరు స్టేషన్‌లో అమృత్‌ భారత్‌ పథకంలో జరుగుతున్న స్టేషన్‌ పునరాభివృద్ధి పనులపై అధికారులతో సమీక్షించారు. ముందుగా అధికారులతో కలసి డీఆర్‌ఎం గూడూరు స్టేషన్‌లోని ప్లాట్‌ఫాంలు, స్టేషన్‌ పరిసర ప్రాంతాలను పరిశీలించారు. ప్రయాణికులకు అందుతున్న సౌకర్యాలు, భద్రతా చర్యలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. పలు సూచనలు చేశారు. ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు అందిస్తూ సకాలంలో పనులను పూర్తిచేయాలని ఆదేశించారు. అక్కడ నుంచి నెల్లూరు స్టేషన్‌కు చేరుకుని స్టేషన్‌ ఆధునికీకరణ పనులను పర్యవేక్షించారు. నూతన భవన నిర్మాణాలు, ప్లాట్‌ఫాం పనులను పర్యవేక్షించి సకాలంలో పూర్తిచేయాలన్నారు. స్థానిక సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా ప్రత్యేక ప్రవేశ ద్వారాలు నెల్లూరు స్టేషన్‌కు ఆకర్షణగా నిలుస్తాయని తెలిపారు. అనంతరం బిట్రగుంట, సింగరాయకొండ, ఒంగోలు స్టేషన్‌లను సందర్శించి సిబ్బందికి అందుతున్న సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు. డివిజన్‌లో గూడూరు–విజయవాడ సెక్షన్‌ అత్యంత కీలకమైనదన్నారు. ఈ సెక్షన్‌లో ప్రపంచ స్థాయి ఆధునిక సౌకర్యాల దిశగా అమృత్‌ భారత్‌ స్టేషన్‌ పథకంలో పనులు వేగంగా చేపట్టినట్లు తెలిపారు. ఈ పనులు త్వరితగతిన పూర్తిచేసి ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపారు.

నందిగామ టౌన్‌: ఇంటిలోని ఫ్యాన్‌కు ఉరేసుకుని యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన పట్టణంలో బుధవారం చోటు చేసుకుంది. సేకరించిన సమాచారం మేరకు పట్టణంలోని పాతబస్టాండ్‌ ప్రాంతానికి చెందిన కాసర్ల లక్ష్మయ్యకు కుమారుడు, కుమార్తె ఉన్నారు. కుమారుడు మనోజ్‌ (24) జేసీబీ ఆపరేటర్‌గా పని చేస్తూ మద్యానికి బానిసై నిత్యం మద్యం తాగుతుండటంతో పలుమార్లు తండ్రి మందలించాడు. ఈ క్రమంలో మంగళవారం రాత్రి కూడా మద్యం తాగి తండ్రితో వాగ్వాదానికి దిగగా తండ్రి మందలించాడు. దీంతో మనస్తాపం చెందిన మనోజ్‌ గదిలోకి వెళ్లి తలుపు వేసుకున్నాడు. ఉదయం లేచి చూసేసరికి మనోజ్‌ ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుని ఉండటాన్ని గమనించిన తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అక్కడకు చేరుకున్న పోలీసులు వివరాలు సేకరించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ వైవీఎల్‌ నాయుడు తెలిపారు. మృతుని తండ్రి లక్ష్మయ్య కొంతకాలంగా పక్షవాతంతో బాధపడుతున్నాడు.

కృష్ణలంక(విజయవాడతూర్పు): అనుమానాస్పద స్థితిలో గుర్తు తెలియని వ్యక్తి మృతిచెందిన ఘటన కృష్ణలంక పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు బెంజిసర్కిల్‌ సమీపంలోని ఐరా హోటల్‌ ముందు సోమవారం రాత్రి 8 గంటల సమయంలో ఒక వ్యక్తి మద్యం తాగి తూలుతూ నడుస్తూ రోడ్డు పక్కన పడిపోయాడు. కాళ్లు, చేతులు కొట్టుకుంటుండగా చుట్టుపక్కల వారు అతనిని 108 అంబులెన్స్‌ ద్వారా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మంగళవారం సాయంత్రం మృతిచెందాడు. మృతుని వద్ద ఊరు, పేరుకు సంబంధించి ఎటువంటి ఆధారాలు లభించలేదని, వయస్సు 45 నుంచి 50 సంవత్సరాల మధ్య ఉండవచ్చని తెలిపారు. హోటల్‌ వాచ్‌మన్‌ నర సింహారావు బుధవారం ఇచ్చిన ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. మృతుని ఆచూకీ తెలిసిన వారు కృష్ణలంక పోలీస్‌ స్టేషన్‌లో సంప్రదించాలని కోరారు.

మధురానగర్‌(విజయవాడసెంట్రల్‌): వేగంగా వచ్చిన ద్విచక్రవాహనం ఢీ కొట్టడంతో పండ్ల వ్యాపారి మృతి చెందిన ఘటన గుణదల పోలీస్‌స్టేషన్‌ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బుడమేరు మధ్య కట్ట లెనిన్‌నగర్‌కు చెందిన పొగిరి శ్రీనివాస్‌(41) మాచవరంలో పండ్ల వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఈయన మంగళవారం రాత్రి తన ద్విచక్రవాహనంపై నున్న బైపాస్‌ వైపు నుంచి గుణదల వైపు వస్తుండగా గుణదల రైల్వేగేటు సమీపంలో ఎదురుగా వేగంగా వచ్చిన ద్విచక్రవాహనం ఢీ కొట్టింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన శ్రీనివాస్‌ను చుట్టుపక్కలవారు చికిత్స నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో పరీక్షించిన వైద్యులు శ్రీనివాస్‌ అప్పటికే మృతి చెందాడని ధ్రువీకరించారు. శ్రీనివాస్‌ భార్య పొగిరి రమాదేవి ఫిర్యాదు మేరకు గుణదల పోలీసులు బుధవారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వేగంగా వచ్చి ఢీకొట్టిన ద్విచక్రవాహన చోదకుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. మృతునికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

గూడూరు–విజయవాడ సెక్షన్‌లో డీఆర్‌ఎం తనిఖీలు 1
1/2

గూడూరు–విజయవాడ సెక్షన్‌లో డీఆర్‌ఎం తనిఖీలు

గూడూరు–విజయవాడ సెక్షన్‌లో డీఆర్‌ఎం తనిఖీలు 2
2/2

గూడూరు–విజయవాడ సెక్షన్‌లో డీఆర్‌ఎం తనిఖీలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement