
26న ఆశ వర్కర్స్ యూనియన్ మహాసభ
మధురానగర్(విజయవాడసెంట్రల్): మైలవరంలో ఈ నెల 26వ తేదీన ఎన్టీఆర్ జిల్లా ఆశ వర్కర్స్ యూనియన్ ఆరో మహాసభ జరుగుతుందని యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.ధనలక్ష్మి తెలిపారు. ఆశ వర్కర్ల యూనియన్ ఎన్టీఆర్ జిల్లా సమావేశం పి.జ్యోతి అధ్యక్షతన సీఐటీయూ జిల్లా కార్యాలయంలో మంగళవారం జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 20 ఏళ్లుగా పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోని పేద ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటూ ఆరోగ్యపరమైన సేవలు అందించ డంలో ఆశ వర్కర్లు కీలకపాత్ర పోషిస్తున్నారని పేర్కొన్నారు. షుగర్, బీసీ, లెప్రసీ, టీబీ, ఎయిడ్స్ వంటి అనేక రకాల వ్యాధిగ్రస్తులకు, గర్భిణులు, బాలింతలు, పసిపిల్లలకు ఆశా వర్కర్లు అందిస్తున్న సేవలు వెలకట్టలేనివన్నారు. ఆశ వర్కర్లను కార్మికులుగా గుర్తించాలని, పనిచేయని ఫోన్లు, సిమ్‌లు వంటి సమస్యలు పరిష్కరిస్తామని ప్రభుత్వం ఇచ్చిన రాతపూర్వకంగా జీఓలు ఇవ్వాలని, మేనిఫెస్టోలో పెట్టిన ప్రకారం ఆశ వర్కర్లకు వేతనాలు పెంచాలని ఆమె డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో ఆశ వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎ.కమల, జిల్లా నాయకులు కె.బేబీరాణి, జి.దయామణి, పి.శ్రావణి, ఎస్.జోత్స్న, టి.రాజామణి కె.సైదమ్మ, వై.నాగలక్ష్మి ఎస్.హేమకుమారి, చిలకమ్మ పాల్గొన్నారు