
నూతన బార్ పాలసీ నోటిఫికేషన్ జారీ
మధురానగర్(విజయవాడసెంట్రల్): ఉమ్మడి కృష్ణా జిల్లాలోని నూతన బార్ పాలసీకి నోటిఫికేషన్ జారీ అయ్యిందని, ఆసక్తి కలిగిన వారు ఈ నెల 26వ తేదీ సాయంత్రం ఐదు గంటల్లోపు దరఖాస్తు చేసుకోవాలని ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ డెప్యూటీ కమిషనర్ టి.శ్రీనివాసరావు తెలిపారు. మాచవరంలో ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ కార్యాలయంలో సోమ వారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ నెల 31వ తేదీతో బార్‌ల లైసెన్సు పూర్తవుతుందన్నారు. కొత్త లైసెన్సు వచ్చేనెల ఒకటో తేదీ నుంచి మూడేళ్లపాటు ఉంటుందన్నారు. ఎన్టీఆర్ జిల్లాలో ఓపెన్ కాంపిటీషన్‌లో 130, కృష్ణా జిల్లాలో 39 చొప్పున మొత్తం 169 బార్‌ల లైసెన్సుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని తెలిపారు. ఆసక్తి కలిగిన వారు ఆన్‌లైన్, ఆఫ్‌లైన్, హైబ్రిడ్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. నూతన బార్ పాలసీ ప్రకారం ఉదయం పది నుంచి రాత్రి 12 గంటల వరకు విక్రయాలు చేసుకోవచ్చని వివరించారు. గతంతో పోలిస్తే రెండు గంటల సమయం పెరిగిందన్నారు. బార్‌లకు దరఖాస్తు చేసుకోవటానికి అప్లికేషన్ ఫీజు రూ.5 లక్షలు, ప్రాసెసింగ్ ఫీజు రూ.10 వేలు చెల్లించాలని స్పష్టంచేశారు. ఈ నెల 28న కలెక్టరేట్‌లో లాటరీ తీస్తామని పేర్కొన్నారు. సమావేశంలో ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ సూపరింటెండెంట్ ఎస్.శ్రీనివాసరావు పాల్గొన్నారు.
గీత కులాలకు 10 బార్లు
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): నూతన బార్ పాలసీ 2025–28లో భాగంగా ఎన్టీఆర్ జిల్లాలో జనరల్ కేటగిరీలో 130 బార్లు, గీత కులాల వారికి ప్రత్యేకంగా పది బార్లు కేటాయించారు. ఈ మేరకు సోమవారం కలెక్టర్ లక్ష్మీశ గెజిట్ విడుదల చేశారు. కలెక్టరేట్‌లోని ఏవీఎస్ రెడ్డి కాన్ఫరెన్స్ హాలులో కలెక్టర్ లక్ష్మీశ లాటరీ నిర్వహించారు. గీత కులాలకు కేటాయించిన పది షాపుల్లో గౌడ్ కులానికి మూడు, గౌడ కులానికి ఏడు బార్లు చొప్పున లాటరీ ద్వారా ఎంపిక చేశారు. గీత కులాల వారికి ప్రత్యేకంగా విజయవాడలో 9 బార్లు, కొండపల్లిలో ఒకటి కేటాయించారు. వీటికి వార్షిక లైసెన్సు ఫీజు విజయవాడలో రూ.37.50 లక్షలు, కొండపల్లిలో రూ.17.50 లక్షలుగా నిర్ణయించారు. ఈ నెల 28న కలెక్టరేట్‌లో బార్లు కేటాయించేందుకు లాటరీ తీయనున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రొహిబీషన్ అండ్ ఎకై ్సజ్ అధికారి శ్రీనివాసరావు, గీత కులాల పెద్దలు పలువురు పాల్గొన్నారు.