
మహిళలు, చిన్నారుల రక్షణకు ప్రత్యేక చర్యలు
కోనేరుసెంటర్: జిల్లాలో మహిళలు, చిన్నారుల రక్షణకు పోలీసుశాఖ ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని ఏలూరు రేంజ్ ఐజీపీ జీవీజీ అశోక్‌కుమార్ పేర్కొన్నారు. వార్షిక తనిఖీల్లో భాగంగా బుధవారం ఆయన మచిలీపట్నం పోలీస్‌స్టేషన్‌ను సందర్శించారు. తొలుత స్టేషన్ సమీపంలోని పింగళి వెంకయ్య విగ్రహానికి ఎస్పీతో కలిసి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన స్టేషన్‌ను సందర్శించి పరిసరాలను పరిశీలించారు. స్టేషన్ ఆహ్లాదకర వాతావరణంలో ఉండేలా చూసుకోవాలని సూచించారు. స్టేషన్‌లో రికార్డులను పరిశీలించారు. రికార్డుల నిర్వహణ విషయంలో సిబ్బంది అత్యంత జాగ్రత్త వహించాలని సూచించారు. అలసత్వం వహించినా, నిర్లక్ష్యంగా వ్యవహరించినా చర్యలు సీరియస్‌గా ఉంటాయని చెప్పారు.
సామరస్యంగా పరిష్కరించండి..
స్టేషన్‌కి వచ్చే ఫిర్యాదుదారులతో మర్యాదపూర్వకంగా మాట్లాడి వారి సమస్యను సామరస్యంగా విని సమస్య పరిష్కారమయ్యేలా చర్యలు తీసుకోవాలని ఐజీపీ సూచించారు. పెండింగ్ కేసుల దర్యాప్తు వేగవంతం చేసి ప్రతి కేసులో క్వాలిటీ ఇన్వెస్టిగేషన్ ఉండేలా జాగ్రత్త వహించాలన్నారు. మహిళలు, చిన్న పిల్లలపై జరిగే నేరాలను కట్టడి చేయడానికి ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో శక్తి యాప్ గురించి, వారికి ఉన్న రక్షణ చట్టాల గురించి శక్తి టీం బృందాల ద్వారా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉండాలన్నారు. సైబర్ నేరాల నియంత్రణకి సామాజిక మాధ్యమాల వినియోగం, ఓటీపీ ఫ్రాడ్స్, బ్యాంక్ మోసాలపై ప్రజల్లో చైతన్యం తీసుకురావాలన్నారు. స్టేషన్ విజిట్‌కు వచ్చిన ఐజీపీకి జిల్లా ఎస్పీ పుష్పగుచ్ఛం అందించి ఆహ్వానం పలికారు. సిబ్బంది నుంచి ఆయన గౌరవవందనం స్వీకరించారు. డీఎస్పీ సీహెచ్ రాజ, బందరు సబ్–డివిజన్ సీఐలు, ఎస్‌ఐలు పాల్గొన్నారు.
మచిలీపట్నం పీఎస్ సందర్శనలో
ఐజీపీ అశోక్‌కుమార్