20, 21 తేదీల్లో ఉచితంగా పుస్తకాల పంపిణీ | Sakshi
Sakshi News home page

20, 21 తేదీల్లో ఉచితంగా పుస్తకాల పంపిణీ

Published Fri, Apr 19 2024 1:25 AM

వ్యయ పరిశీలకులు జస్టిన్‌కు పుష్పగుచ్ఛం అందజేస్తున్న కలెక్టర్‌ ఢిల్లీరావు   - Sakshi

పటమట(విజయవాడతూర్పు): ప్రపంచ పుస్తక దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌ గ్రంథాలయ సంఘం ఆధ్వర్యంలో ఉచిత పుస్తకాల పంపిణీ కార్యక్రమం ఏప్రిల్‌ 20, 21 తేదీల్లో విజయవాడ సర్వోత్తమ గ్రంథాలయంలో నిర్వహిస్తున్నామని సంఘ ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ రావి శారద ఒక ప్రకటనలో తెలిపారు. బెంగళూరులోని మనసు ఫౌండేషన్‌ స్థాపకులు ఎం.వి.రాయుడు కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని చెప్పారు. ఇందులో సాధారణ గ్రంథాలతో పాటు తత్వశాస్త్రం, మతాలు, ఆధ్యాత్మిక, సాంఘిక, భాష, ఇంజినీరింగ్‌, వైద్య, విజ్ఞాన శాస్త్రాలు, కళలు, తెలుగు, ఆంగ్ల సాహిత్య గ్రంథాలు, చరిత్ర, బాల సాహిత్యం, వ్యక్తిత్వ వికాసం తదితర పుస్తకాలు ఉంటాయని పేర్కొన్నారు. అలానే పదవ, ఇంటర్‌, డిగ్రీ విద్యార్థులకు సంబంధించిన స్టడీ మెటీరియల్స్‌తో కలిపి దాదాపు 35 వేలకు పైగా పుస్తకాలు పంపిణీ చేయనున్నట్లు వెల్లడించారు. పోటీ పరీక్షలకు హాజరయ్యే వారితోపాటు, వత్తి విద్యా కోర్సులు అభ్యసించే వారికి కూడా ఉపయోగపడే వేలాది పుస్తకాలు అందుబాటులో ఉన్నాయన్నారు. పౌరులందరూ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.

ఎన్టీఆర్‌ జిల్లాకు ఎన్నికల వ్యయ

పరిశీలకుల నియామకం

గాంధీనగర్‌(విజయవాడసెంట్రల్‌): విజయవాడ పార్లమెంటరీ నియోజకవర్గ ఎన్నికల వ్యయ పరిశీలకులుగా ఐఆర్‌ఎస్‌ అధికారి వి.జస్టిన్‌ నియమితులయ్యారు. విజయవాడ పశ్చిమ, విజయవాడ సెంట్రల్‌, తిరువూరు, మైలవరం నియోజకవర్గాలకు సంబంధించి ఎన్నికల వ్యయ పరిశీలకులుగా ఐఆర్‌ఎస్‌ అధికారి సౌరభ్‌ శర్మ, విజయవాడ తూర్పు, నందిగామ, జగ్గయ్యపేట నియోజకవర్గాలకు ఎన్నికల వ్యయ పరిశీలకులుగా ఐఆర్‌ఎస్‌ అధికారి మదన్‌ కుమార్‌ నియమితులయ్యారు. గురువారం వీరిని పంచాయతీరాజ్‌ అతిథి గృహంలో జిల్లా కలెక్టర్‌ ఎస్‌.ఢిల్లీరావు, జేసీ పి.సంపత్‌ కుమార్‌లు మర్యాదపూర్వకంగా కలిసి పుష్ఫగుచ్ఛాన్ని అందజేశారు.

Advertisement
 
Advertisement