
పెడనలో చంద్రబాబు ప్రసంగిస్తుండగా వెనుదిరిగిపోతున్న జనం(ఫైల్)
● జనాకర్షణ ఏ మాత్రం లేని చంద్రబాబు, పవన్ పర్యటన ● గళం వినే జనం లేక గంటల సేపు బస్సులోనే బాబు ● మూడు పార్టీలు కలిసి సమీకరించినా అంతంతమాత్రంగానే హాజరు ● మచిలీపట్నంలో కనిపించని బీజేపీ నేతలు, జెండాలు ● బాబు మైకు అందుకోగానే సోది వినలేక వెనుతిరిగిన జనం
సాక్షి, మచిలీపట్నం: టీడీపీ అధినేత చంద్రబాబు మూడు పార్టీల కూటమితో కలిసి నిర్వహిస్తున్న షోలు వరుసగా అట్టర్ ఫ్లాప్ అవుతున్నాయి. ప్రజల మద్దతు లేకపోవడంతో అసహనానికి గురవుతున్న ఆ పార్టీ నేతలు సంక్షేమ ప్రభుత్వంపై విమర్శలు చేయడం, వైఎస్సార్ సీపీ అధినేత, సీఎం జగన్‌పై ఆరోపణలు చేయడమే లక్ష్యంగా తమ ప్రచారాలు నిర్వహిస్తున్నారు. జనసేన, బీజేపీలతో జతకట్టిన తెలుగుదేశం పార్టీ నిర్వహిస్తున్న షోలు, సభలకు ఏ మాత్రం స్పందన కానరావడం లేదు. ఈ నేపథ్యంలో రోజువారీ కూలీలకు డబ్బు, మందు, బిర్యానీలు ఆఫర్ ఇచ్చి రప్పించినా.. సభ పూర్తయ్యే వరకు కూడా వారు ఉండడం లేదు. పాడిందే పాట అన్నట్లు చంద్రబాబు చెప్పిందే చెబుతుండడంతో ఆ సోది వినలేక సభ ప్రారంభమై, బాబు మైకు అందుకోగానే జనం వెనక నుంచి గుంపులు గుంపులుగా ఇళ్లకు వెళ్లిపోతున్నారు.
పెడన, మచిలీపట్నంలో...
ఎన్నికల నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు ప్రజాగళం పేరుతో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా బుధవారం ఆయన జనసేన నేత పవన్ కల్యాణ్‌తో కలిసి జిల్లాలోని పెడన, మచిలీపట్నంలలో కార్యక్రమం నిర్వహించారు. సభను జయప్రదం చేసి, ఉనికి కాపాడుకోవాలనే తాపత్రయంలో కూటమి నేతలు ఎంత కసరత్తు చేసినా ప్రజల నుంచి అంతంత మాత్రంగానే స్పందన లభించింది. ఇది ముందే ఊహించిన పార్టీ నేతలు తమ సభలను మైదానాల్లో కాకుండా ఇరుకు సందులు, ట్రాఫిక్ ఉండే రోడ్లలో ఏర్పాటు చేసుకుంటుండటం గమనార్హం. పెడనలో బస్టాండ్ సెంటర్‌లో, మచిలీపట్నంలో కోనేరు సెంటర్ నుంచి విజయవాడ వెళ్లే రోడ్డులో ట్రాఫిక్ నిలిపివేసి సభలు నిర్వహించారు. పెడనలో మూడు పార్టీలు కలిసినా 3వేలకు మించని జనం.. మచిలీప
ట్నంలో సైతం 5వేలు దాటలేదు. గతంలో పామర్రు, ఉయ్యూరుల్లోనూ ఇదే పరిస్థితి.
జనం లేక ఆలస్యంగా సభలు
జన సమీకరణ కోసం కూటమి అభ్యర్థులు పెద్దఎత్తున ప్రయత్నాలు చేసినా ఫలించలేదు. షెడ్యూల్ ప్రకారం పెడనలో మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభం కావాల్సిన సభ సాయంత్రం 6:30 గంటలకు ప్రారంభమైంది. మచిలీపట్నంలో రాత్రి 7 గంటలకు ప్రారంభం కావాల్సి ఉండగా 9 గంటలకు ఆరంభమైంది. ఆచరణకు సాధ్యం కాని అబద్ధపు హామీలతో కూడిన చంద్రబాబు ప్రసంగం వినే ఓపిక తమకు లేదని జనం అనుకుంటున్నారు. బాబు మాట్లాడడం ప్రారంభమైన వెంటనే జనం గుంపులు గుంపులుగా వెనుతిరిగి వెళ్లిపోవడం ప్రారంభించారు.
ఎక్కడా కనిపించని బీజేపీ జెండాలు
ఎన్నికల్లో ఎలాగైనా అధికారంలోకి రావాలనే లక్ష్యంతో చంద్రబాబు జనసేన, బీజేపీలతో జత కట్టారు. అయితే ఆయన ఆ పార్టీ అధినేతలను తన వైపు తిప్పుకున్నప్పటికీ కింది స్థాయి కేడర్, కార్యకర్తల నుంచి పూర్తి స్థాయి మద్దతు కరువైంది. మచిలీపట్నంలో జరిగిన సభలో బీజేపీ జెండాలు ఎక్కడా కనిపించలేదు.
జగన్‌కు అడుగడుగునా జన ప్రవాహం
సీఎం వైఎస్ జగన్ ఎన్నికల ప్రచారానికి ఎక్కడకు వెళ్లినా జన ప్రవాహం ఉవ్వెత్తున కదిలివస్తోంది. ఈ నెల 15వ తేదీన వైఎస్ జగన్ కృష్ణా జిల్లాలో మేమంతా సిద్ధం బస్సు యాత్ర నిర్వహించారు. జిల్లాలో ప్రవేశించినప్పటి నుంచి పశ్చిమ గోదావరి జిల్లాలోకి వెళ్లే వరకు అడుగడుగునా జనం నీరాజనం పలికారు. గన్నవరం బస్సు యాత్రలో, బహిరంగ సభ ఏర్పాటు చేసిన గుడివాడలో వీధులన్నీ జనంతో నిండిపోయాయి. 10 ఎకరాల సభా మైదానం కిక్కిరిసిపోయి వేల మంది రోడ్లపైనే ఉండిపోయారు. జగన్ సభలకు వచ్చిన జనంతో పోలిస్తే... చంద్రబాబు కూటమి షోలు జనం లేక వెలవెలపోయాయి.