నామినేషన్ దాఖలు చేసిన అభ్యర్థులు పార్టీ ప్రచారం పై పూర్తి స్థాయిలో దృష్టి సారించనున్నారు. ఇప్పటికే ఉమ్మడి కృష్ణా జిల్లాలో వైఎస్సార్ సీపీ అభ్యర్థులు, గడపగడపకు మన ప్రభుత్వంతో పాటు నియోజకవర్గంలో పార్టీ పిలుపు ఇచ్చిన పలు కార్యక్రమాల ద్వారా నియోజకవర్గాన్ని రెండు, మూడు సార్లు చుట్టేశారు. ప్రతి గడపను సందర్శించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను, వ్యక్తిగతంగా ఐదేళ్లలో తమ కుటుంబాలకు జరిగిన ఆర్థిక లబ్ధిని వివరించారు. వైఎస్సార్ సీపీ అభ్యర్థులు ప్రచారంలో ముందంజలో ఉన్నారు. సిద్ధం సభలు, మేమంతా సిద్ధం బస్సు యాత్ర కార్యక్రమాలు మరింత జోష్ నింపాయి. దీంతో రెట్టించిన ఉత్సాహంతో అభ్యర్థులు ప్రచారంలో దూసుకుపోతున్నారు. టీడీపీ అభ్యర్థులు తమ పాలనలో చేసిన అవినీతి, జన్మభూమి కమిటీల దాష్టీకాలను ప్రజలు గుర్తు చేసుకొంటూ, అభ్యర్థులకు సహకరించడం లేదు. వీరి ప్రచారాలకు స్పందన కరువు అవుతోంది. కార్యకర్తల్లోనూ నైరాశ్యం ఆవహిస్తోంది. దీంతో టీడీపీ అభ్యర్థులు తలలు పట్టుకొంటున్నారు.