
వివేక్ రామస్వామిపై అమెరికన్ల ట్రోలింగ్
ఇండియాకు వెళ్లిపోవాలంటూ విద్వేషం
'అమెరికాతో మీకేం సంబంధం ఉంది. భారత దేశానికి తిరిగి వెళ్లిపోయి ముంబై, గుజరాత్‌లతో సంబరాలు చేసుకోండి. మీ భార్య మిమ్మల్ని వదిలేస్తుంది' అంటూ భారత సంతతికి చెందిన రిపబ్లికన్ పార్టీ నాయకుడు వివేక్ రామస్వామిపై అమెరికన్లు విరుచుకుపడుతున్నారు. వివేక్ రామస్వామిపై అమెరికన్లు జాత్యాహంకార వ్యాఖ్యలు చేయడం కొత్తేమీ కాదు. ఒహియో గవర్నర్ పదవికి పోటీ పడుతున్న ఆయనపై సోషల్ మీడియా వేదికగా అమెరికా పౌరులు విద్వేషం వెళ్లగక్కుతున్నారు. తాజాగా ఎక్స్‌లో షేర్ చేసిన ఫొటోపై తీవ్రంగా ట్రోలింగ్ చేస్తున్నారు.
జాతి విద్వేష వ్యాఖ్యలతో ట్రోలింగ్
జూలై 4న అమెరికా స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా భార్యా, పిల్లలతో దిగిన ఫొటోను వివేక్ రామస్వామి (Vivek Ramaswamy) తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. 'చిన్న పిల్లలు ప్రతి సంవత్సరం పెద్దవుతున్నారు. హ్యాపీ ఫోర్త్!' అంటూ క్యాప్షన్ జోడించారు. దీనిపై అమెరికన్లు జాతి విద్వేష వ్యాఖ్యలతో ఆయనను ట్రోలింగ్ చేస్తున్నారు. 'మీరు మీ కుటుంబంతో గుజరాత్ లేదా ముంబైలో జరుపుకోవాలి' అంటూ ఒకరు కామెంట్ చేశారు. 'మీరు ఫ్రీడమ్ ఫ్రైస్‌ని, యాంకర్ బేబీ పౌరసత్వాన్ని తిరిగి పొందారా' అంటూ మరొకరు ప్రశ్నించారు.
ఒకరైతే వివేక్ రామస్వామి భార్య ఆయనను వదిలి వెళ్లిపోతుందంటూ అనుచిత వ్యాఖ్యలు చేశారు. 'ట్రంప్ పాలనలో మీ కుటుంబం లేదా స్నేహితులు ఎవరైనా బహిష్కరించబడతారా అని నేను ఆశ్చర్యపోతున్నాను? బహుశా మీ భార్య కుటుంబ సభ్యులను బహిష్కరిస్తే ఆమె మిమ్మల్ని వదిలివేస్తుంది' అని మరో అమెరికన్ ట్రోల్ చేశారు.
అయితే వివేక్ రామస్వామిపై జాతి వివక్ష వ్యాఖ్యలు కొత్తేం కాదు. మే నెలలో తమ వివాహ వార్షికోత్సవం సందర్భంగా ఎక్స్‌లో షేర్ చేసిన ఫొటో పైనా కూడా ఆయన వ్యతిరేకులు ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. ఇండియాకు తిరిగి వెళ్లిపోవాంటూ తిట్టిపోశారు. వివేక్ సతీమణి డాక్టర్ అపూర్వ తివారి కూడా భారత సంతతికి చెందిన వారే. ఆమె కూడా అమెరికాలోనే జన్మించారు.
వివేక్ యాంకర్ బేబీనా?
అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) జన్మతః పౌరసత్వాన్ని రద్దు చేసిన తర్వాత వివేక్ రామస్వామిపై కొత్త ద్వేషం మొదలైంది. ట్రంప్ రెండోసారి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టక ముందు.. అమెరికాలో జన్మించిన ఎవరికైనా ఆటోమేటిక్‌గా పౌరసత్వం దక్కేది. అయితే ఇది అందరికీ ఉద్దేశించింది కాదని, అందుకే ఈ నియమాన్ని మార్చాలనుకుంటున్నట్టు ట్రంప్ ప్రకటించారు. ఈ వివాదాస్పద నిర్ణయాన్ని న్యాయస్థానాల్లో సవాల్ చేయడంతో దీని అమలుపై సందిగ్దం కొనసాగుతోంది.
చదవండి: ట్రంప్ మెగా బిల్లు.. ఎన్నారైలకు బిగ్ అలర్ట్
మరోవైపు వివేక్ రామస్వామిని యాంకర్ బేబీ అంటూ అమెరికన్లు ట్రోల్ చేస్తున్నారు. ఎందుకంటే సిన్సినాటిలో వివేక్ పుట్టేటప్పటికి ఆయన తల్లికి అమెరికా పౌరసత్వం లేదు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు. తాను పుట్టిన తర్వాత తన తల్లి పౌరసత్వ పరీక్ష రాసిందని, తన తండ్రి కూడా అప్పటికి అమెరికా పౌరుడు కాదని ఒప్పుకున్నారు. అయితే తన తల్లిదండ్రులు చట్టబద్ధంగా అమెరికాకు వలస వచ్చారని చెప్పారు. చట్టవిరుద్ధంగా అమెరికాలోకి ప్రవేశించిన తల్లిదండ్రుల పిల్లలకు జన్మతః పౌరసత్వం వర్తించదని, వర్తించకూడదని తాను భావిస్తున్నట్టు గతంలో వివేక్ రామస్వామి అన్నారు.
The little guys get bigger every year. Happy Fourth! pic.twitter.com/IyfVeLewjx
— Vivek Ramaswamy (@VivekGRamaswamy) July 4, 2025