
బ్యాంకులకు రూ. వేల కోట్లు ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన వ్యాపారవేత్త విజయ మాల్యాను తాజాగా సోషల్‌మీడియాలో యూజర్లు గట్టిగా తగులుకున్నారు. ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ (IPL) సీజన్‌లో లక్నో సూపర్ జెయింట్స్ (LSG) జట్టుపై విజయం సాధించిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) టీమ్‌కు విజయ్ మాల్యా అభినందనలు తెలిపారు.
ఆర్‌సీబీని ప్రశంసిస్తూ ‘ఎక్స్’(ట్విటర్)లో విజయ్ మాల్యా ఓ పోస్ట్ పెట్టాడు. అంతే దొరికాడురా అంటూ నెటిజన్‌లు గట్టిగా తగులుకున్నారు. ఆయన చేసిన పోస్టును ట్రోల్ చేస్తూ చట్టపరమైన చర్యలను ఎదుర్కొనేందుకు భారత్‌కు తిరిగి రావాలని కోరారు. ఫైనల్ మ్యాచ్ చూసేందుకు ఇండియా రావచ్చుగా.. అని ఒకరు ట్వీట్ చేయగా భారత్‌లో ప్లేఆఫ్స్ చూడటానికి రండి.. అంటూ మరొకరు ట్వీట్ చేశారు. 'కమ్ బ్యాక్ టు ఇండియా మ్యాన్'.. "ఎప్పుడు వస్తున్నావు?".. ఇలా మరికొందరు కామెంట్లు చేశారు.
ఒకప్పుడు కింగ్ ఆఫ్ గుడ్ టైమ్స్ గా పేరొందిన విజయ్ మాల్యా కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ పతనంతో దివాలా తీశాడు. కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ కోసం ఎస్‌బీఐ నేతృత్వంలోని భారతీయ బ్యాంకుల కన్సార్టియంకు రూ .9,000 కోట్లకు పైగా ఎగ్గొట్టి ఆర్థిక మోసం, మనీలాండరింగ్ ఆరోపణల మధ్య 2016లో దేశం నుండి పారిపోయాడు. ప్రస్తుతం యూకేలో ఉంటున్న మాల్యా.. దివాలా, భారత్ కు అప్పగింతపై న్యాయపోరాటం చేస్తున్న సంగతి తెలిసిందే.