US: క్రూయిజ్‌ ఎక్కే అదృష్టం కూడా ఉండాలేమో.! | Sakshi
Sakshi News home page

క్రూయిజ్‌ ఎక్కే అదృష్టం కూడా ఉండాలేమో.!

Published Fri, Apr 5 2024 10:33 AM

Travel To America Good Luck Taking A Cruise  - Sakshi

రోడ్డు, రైలు, వాయు రవాణాలు ఎన్నున్నా తెలంగాణా సముద్ర తీరంలేని రాష్ట్రం కావడం వల్ల జల రవాణాకు ఉపయోగించే ఓషన్ లైనర్స్, విహార యాత్రలకు వాడే క్రూయిజ్ షిప్లు ఇక్కడి వాళ్లకు కొత్త. అయితే మన దేశంలో విస్తారమైన తీర ప్రాంతం ఉంది. ముఖ్యంగా ముంబై , గోవా, విశాఖ, లక్ష్యదీప్, కేరళ, అండమాన్, కొచ్చి, మాల్ దీవ్ జలాల్లో క్రూయిజ్‌లు సందర్శకులతో రౌండ్ ట్రిప్లు చేస్తూ మన పర్యాటక పరిశ్రమలో ప్రధానపాత్ర వహిస్తున్నాయి. క్రూయిజ్ అనగానే మనకు జ్ఞాపకం వచ్చేది ‘ టైటానిక్ ’ . 1912 నాటి ఈ అతిపెద్ద ప్రయాణికుల నౌక తన మొదటి ప్రయాణంలోనే ఏప్రిల్ 14 న ప్రమాదవశాత్తు ఒక మంచుకొండను ఢీకొని సముద్రంలో మునిగిపోవడం, అందులోనున్న 1500కు పైగా ప్రయాణికులు, సిబ్బంది చనిపోవడం అదో పెద్ద చరిత్ర.

ఈ నేపథ్యంతో జేమ్స్ కామెరాన్ రూపొందించిన హాలీవుడ్ ప్రేమ కథా చిత్రం టైటానిక్ ( 1997 ) ప్రపంచ వ్యాప్తంగా విడుదలయి సినీ ప్రపంచంలోనే మరో చరిత్ర సృష్టించింది. సముద్ర మార్గాల్లో తిరిగే ఈ క్రూయిజ్‌లలో పర్యాటకులు బస చేయడానికి కావలసిన అన్ని సౌకర్యాలు, విలాసాలు ఉంటాయని వినడమే కానీ వీటిలో విహరించే అవకాశం మాకు 2016 అక్టోబర్‌లో అమెరికా వెళ్ళినప్పుడు మాత్రమే వచ్చింది. అప్పుడే అమెరికాలో హాలోవిన్ దయ్యాల పండగ నడుస్తోంది.

మన దగ్గర పీర్ల పండగ కోలల్లాగ పిల్లలు ఇంటింటికి వెళ్లి క్యాండీలు సేకరిస్తూ ఆనందోత్సాహల్లో మునిగి తేలుతున్నారు. మా అమ్మాయి ఎంబీఏ పట్టా ప్రదానం చేసిన సందర్భంగా కోజుమల్ మెక్సికో క్రూయిజ్ ట్రిప్ ప్లాన్‌ చేసుకున్నాం. డల్లాస్ నుం కారులో బయలుదేరి, ఆ రోజంతా ప్రయాణం తర్వాత ,రాత్రి 12 గంటలకు కుబాసియానా ఒక హోటల్లో బస చేసి మరునాడు ఉదయమే పోర్ట్కు చేరుకున్నాము. మేము క్రూయిజ్ అనబడే కొత్త ప్రపంచం లోకి అడుగు పెట్టింది డిసెంబర్ 15 నాడు, ఎయిర్‌పోర్ట్‌ లాగే సెక్యూరిటీ, పాస్‌పోర్ట్‌, వీసా వగైరా చెకింగ్‌లు చేశారు.

అదో బహుళ అంతస్తుల భవనంలా ఉంది, అందులో అన్ని వసతులున్న ఏసి గదులున్నాయి. బాల్కనీ నుంచి కరీబియన్ సముద్రాన్ని చూస్తుంటే చుట్టు పక్కల ఏమీ కనబడలేదు పెద్ద పెద్ద అలలతో మమ్మల్ని ఆహ్వానిస్తున్న జలాలు తప్ప. లంచ్ అయినా డిన్నర్ అయినా షిప్‌లోని పెద్దపెద్ద హోటళ్లలోనే. డిసెంబర్ 16 నాడు క్రిస్మస్ ప్రోగ్రాము కూడా పెద్ద ఎత్తున ఏర్పాటు చేశారు. పక్కకే క్యాసినోలు, క్యాబరేలు.. డబ్బులుంటే వినోదాలకు కొరత లేదు. డిసెంబర్ 17 నాడు కొజు మల్ మెక్సికో ఐలాండ్ మీద అడుగు పెట్టాం.

అక్కడి బీచ్ సన్ బాత్ చేసేవాళ్లతో కళకళలాడిపోతుంది. నదీ స్నానాన్ని మించిన ఆనందమేదో సముద్రంలో ఉన్నట్టుంది. అక్కడే డాల్ఫిన్లను చూశాం, ఆ సరదా కూడా తీర్చుకున్నాం. అక్కడ ఎన్ని సౌకర్యాలున్నాయంటే.. అప్పటికప్పుడు మన ఫోటోలు తీసిపెట్టేవాళ్లకు కొదువ లేదు. అక్కడ లభించే బఫె భోజనాల్లో రకరకాల సీఫుడ్ జీర్ణించుకునే శక్తి ఉంటే ఎంతైనా తినవచ్చు. ఆ ద్వీపాన్ని వదిలి మళ్ళీ క్రూయిజ్లోకి ప్రవేశించే సరికి సొంత ఇంట్లోకి వచ్చిన భావన కలిగింది. ఆ రోజు రాత్రంతా సముద్రం మీద ప్రయాణం, డిసెంబర్ 19 నాడు క్రూయిజ్ మళ్లీ మేము బయలుదేరిన పోర్ట్కు చేర్చింది. ఇష్టమైన బ్రేక్ ఫాస్ట్ పెట్టి మరీ క్రూయిజ్ సిబ్బంది మాకు వీడ్కోలు పలికారు, మళ్ళీ మళ్ళీ రావాలని చెబుతూ !
వేముల ప్రభాకర్‌

(చదవండి: యూఎస్‌లోనే అత్యంత సంపన్న మహిళగా..ఏకంగా రూ. 75 వేల కోట్లు..!)

Advertisement
 
Advertisement
 
Advertisement