డాలస్‌లో ఘనంగా 157వ గాంధీ జయంతి వేడుకలు.. | NRI News: Gandhi Jayanti Celebrations Dallas Texas | Sakshi
Sakshi News home page

డాలస్‌లో ఘనంగా 157వ గాంధీ జయంతి వేడుకలు..

Oct 5 2026 9:58 AM | Updated on Oct 5 2026 10:02 AM

NRI News: Gandhi Jayanti Celebrations Dallas Texas

ఎన్‌ఆర్‌ఐ

డాలస్‌, టెక్సస్‌: అమెరికాలోని టెక్సస్‌లో డాలస్‌ సమీపంలోని మహాత్మాగాంధీ మెమోరియల్‌ వద్ద గాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. వర్షం కారణంగా వాతావరణం అనుకూలంగా లేకపోయినా వందలాది మంది ప్రవాస భారతీయులు కార్యక్రమానికి హాజరయ్యారు. మహాత్మాగాంధీ మెమోరియల్‌ ఆఫ్‌ నార్త్‌ టెక్సస్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో శాంతి నడక యాత్రతో పాటు పలు కార్యక్రమాలు చేపట్టారు.

మహాత్మాగాంధీ మెమోరియల్‌ ఆఫ్‌ నార్త్‌ టెక్సస్‌ వ్యవస్థాపక కార్యదర్శి రావు కల్వాల మాట్లాడుతూ.. గత 12 ఏళ్లుగా గాంధీ జయంతి సందర్భంగా పార్కులో శాంతి నడక యాత్ర నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ ఏడాది వర్షం కారణంగా ఇబ్బందులు ఎదురైనా పెద్ద సంఖ్యలో ప్రవాస భారతీయులు తరలిరావడం సంతోషంగా ఉందన్నారు.

మెమోరియల్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు డా. ప్రసాద్‌ తోటకూర మాట్లాడుతూ.. ప్రపంచవ్యాప్తంగా యుద్ధ వాతావరణం నెలకొన్న ప్రస్తుత సమయంలో గాంధీజీ సిద్ధాంతాలు మరింత ప్రాధాన్యం సంతరించుకున్నాయని అన్నారు. శాంతియుత ప్రతిఘటనతో శక్తిమంతమైన సామ్రాజ్యాన్ని సైతం ఎదుర్కోవచ్చని గాంధీజీ ప్రపంచానికి చూపించారని తెలిపారు. మార్టిన్‌ లూథర్‌ కింగ్‌ జూనియర్, నెల్సన్‌ మండేలా వంటి నాయకులు గాంధీజీ సిద్ధాంతాల నుంచి స్ఫూర్తి పొందారని గుర్తుచేశారు. అక్టోబర్‌ 2ను ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ అహింసా దినోత్సవంగా ప్రకటించిందన్నారు.

కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇర్వింగ్‌ డిప్యూటీ మేయర్‌ మార్క్‌ క్రోనన్వెట్‌ హాజరై గాంధీజీకి నివాళులర్పించారు. ఈ ప్రాంత అభివృద్ధిలో ప్రవాస భారతీయుల కృషి అభినందనీయమని అన్నారు. అమెరికాలోనే అతిపెద్ద మహాత్మాగాంధీ మెమోరియల్‌ ఇక్కడ ఉండటం నగరానికి గర్వకారణమని పేర్కొన్నారు. ప్రత్యేక అతిథి, కాపెల్‌ సిటీ కౌన్సిల్‌ సభ్యుడు రమేశ్‌ ప్రేమకుమార్‌ కూడా గాంధీజీ సేవలను కొనియాడుతూ పుష్పాంజలి ఘటించారు.

ప్రముఖ గాంధేయవాది, మెమోరియల్‌ గవర్నెన్స్‌ బోర్డు సభ్యుడు డా. సూదనగుంట రాఘవేంద్ర ప్రసాద్‌ రచించిన ‘ది పెరల్స్‌ ఆఫ్‌ గాంధీజీస్‌ విజ్డమ్‌’ పుస్తకాన్ని డిప్యూటీ మేయర్‌ మార్క్‌ క్రోనన్వెట్‌ ఆవిష్కరించారు. అనంతరం పలువురు అతిథులు, బోర్డు సభ్యులు, నిర్వాహకులను సత్కరించారు. శాంతికి చిహ్నంగా పది శ్వేత కపోతాలను ఎగురవేశారు.

‘ఇండియా టుడే’ సౌత్‌ లేక్‌ రెస్టారెంట్‌ అందించిన అల్పాహారంతో వేడుకలు ముగిశాయి. అలాగే, కార్యక్రమం విజయానికి సహకరించిన కార్యకర్తలు, బోర్డు సభ్యులు, అధికారులు, అతిథులకు డా. ప్రసాద్‌ తోటకూర కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇండియా అసోసియేషన్‌ ఆఫ్‌ నార్త్‌ టెక్సస్‌ ఉపాధ్యక్షుడు దీపక్‌ కాల్రాతో పాటు పలువురు సభ్యులు, ప్రవాస భారతీయులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి: విదేశాల్లోని భారతీయుల జాబితా ఇదే..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement