
బర్లిన్, 21 సెప్టెంబర్ 2025 – బర్లిన్ హాసెన్‌హైడేలోని శ్రీ గణేశ ఆలయం రంగురంగుల పూలు, సాంప్రదాయ గీతాలు, నృత్యాలతో అలంకరించబడింది. తెలంగాణా అసోసియేషన్ జర్మనీ (TAG) e.V., స్థాపక అధ్యక్షుడు డాక్టర్ రఘు చాలిగంటి నాయకత్వంలో 12వసారి బతుకమ్మ ఉత్సవం ఘనంగా జరిగింది.
ప్రధాన అతిథిగా భారత రాయబార కార్యాలయం (బర్లిన్) మంత్రి (పర్సనల్) డాక్టర్ మంధీప్ సింగ్ తులీ హాజరై బతుకమ్మను తలపై మోసి పూజల్లో పాల్గొన్నారు. జర్మనీలోని అనేక భారతీయ సంఘాల అధ్యక్షులు కూడా వేడుకను శుభాకాంక్షలతో అభినందించారు.

300 మందికి పైగా తెలుగు మహిళలు, కుటుంబ సభ్యులు బర్లిన్ , పరిసర ప్రాంతాల నుండి చేరి బతుకమ్మలను పేర్చారు. బొడ్డెమ్మ పూజ, గౌరి పూజలు నిర్వహించిన తరువాత, సాంప్రదాయ తెలుగు వంటకాలతో విందు చేశారు. సాంప్రదాయం, వినోదం కలిసిన కార్యక్రమంలో నృత్యాలు, సాంస్కృతిక ప్రదర్శనలు, ఫ్యాషన్ షోలు, ర్యాంప్ వాక్స్, తంబోలా వంటి కార్యక్రమాలు ప్రేక్షకులను అలరించాయి.

వేడుక విజయవంతం కావడంలో TAG సభ్యులు – వెంకట రమణ బోయినిపల్లి, అలేఖ్య భోగ, శరత్ రెడ్డి కమిడి, బాలరాజ్ ఆండే, అవినాష్ పోతుమంచి, శ్రీనాథ్ రమణి, నరేష్ తౌటమ్, నటేష్ చెట్టి, అమూల్య బొమ్మరబోయిన – కీలకపాత్ర పోషించారు. అంతేకాక, అనేక మంది వాలంటీర్లు ఉత్సాహభరితంగా సహకరించారు.

బతుకమ్మ లాంటి వేడుకలు సంప్రదాయాన్ని నిలబెట్టి, సమాజ బంధాలను మరింత బలపరిస్తాయని, ఇలాంటి కార్యక్రమాలకు ప్రవాస తెలుగు సమాజానికి TAG ఎల్లప్పుడూ అండగా ఉంటుందని నిర్వాకులు ప్రకటించారు. TAG ఈ సమాజాన్ని ఒక యూనిట్‌గా బలంగా నిలబెట్టేలా నిరంతరం కృషి చేస్తుందన్నారు నవ్వులు, స్నేహం, ఆత్మీయతలతో ముగిసిన ఈ ఉత్సవంలో, బర్లిన్‌లోని తెలుగు సమాజం తెలంగాణా సంస్కృతి, ఆత్మ, ఐక్యతను ఘనంగా ప్రతిబింబించింది
