కెనడాలో భారత పౌరులకు హెచ్చరికలు | Canada warns Indians of fake consulate calls | Sakshi
Sakshi News home page

కెనడాలో భారత పౌరులకు హెచ్చరికలు

Jun 13 2026 6:46 AM | Updated on Jun 13 2026 10:27 AM

Canada warns Indians of fake consulate calls

కెనడాలోని భారత పౌరులకు అక్కడి అధికార యంత్రాంగం కీలక అడ్వైజరీ జారీ చేసింది. వీసా, ఇమిగ్రేషన్‌ హోదా, శాశ్వత నివాసం, ఉద్యోగాల పేరుతో వచ్చే ఫోన్‌ కాల్స్‌ పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. కాన్సులేట్‌ అధికారులు లేదంటే ఇమిగ్రేషన్‌ విభాగం పేరుతో మోసాలు పెరిగిపోతున్న నేపథ్యంలోనే అత్యంత జాగ్రత్తగా ఉండాలని స్పష్టం చేసింది.

కెనడాలో నివసిస్తున్న భారతీయులే లక్ష్యంగా సైబర్‌ మోసగాళ్లు కొత్త తరహా మోసాలకు పాల్పడుతున్నట్లు వెలుగులోకి వచ్చింది. తాము కాన్సులేట్‌ కార్యాలయం నుంచి మాట్లాడుతున్నామని చెప్పుకుంటూ కొందరు వ్యక్తులు ఫోన్‌ కాల్స్‌ చేస్తున్నారు. వీసా స్టేటస్‌ సమస్యలు ఉన్నాయని, ఇమిగ్రేషన్‌ పత్రాలు అప్డేట్‌ చేయాలని లేదంటే తక్షణమే డబ్బులు చెల్లించాల్సి ఉంటుందని భయపెట్టి ప్రజలను మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు అధికారులు హెచ్చరించారు.

ఈ తరహా కాల్స్‌లో కొందరు మోసగాళ్లు ఉద్యోగ అవకాశాలు, పర్మనెంట్‌ రెసిడెన్సీ ప్రాసెసింగ్‌, లేదా డిపోర్టేషన్‌ బెదిరింపులు వంటి విషయాలను ప్రస్తావిస్తూ ఒత్తిడి తీసుకువస్తున్నారని సమాచారం. అధికారికంగా అయితే ఎటువంటి ప్రభుత్వ సంస్థలు ఫోన్‌ ద్వారా డబ్బులు డిమాండ్‌ చేయవని స్పష్టం చేయడం జరిగింది.

ఈ నేపథ్యంలో కెనడా అధికారులు, భారత కాన్సులేట్‌ కార్యాలయాలు ప్రజలకు కీలక సూచనలు జారీ చేశాయి. అనుమానాస్పద ఫోన్‌ కాల్స్‌ వస్తే ఎలాంటి వ్యక్తిగత సమాచారం, పాస్‌పోర్ట్‌ వివరాలు, బ్యాంక్‌ డేటా లేదంటే ఓటీపీలు పంచుకోవద్దని గట్టిగా హెచ్చరించారు. అలాగే తక్షణ నిర్ణయాలు తీసుకోవద్దని, అధికారిక వెబ్‌సైట్‌ లేదంటే నేరుగా కాన్సులేట్‌ను సంప్రదించాలని సూచించారు.

కెనడాలోని భారతీయులు ఈ తరహా మోసాలకు బలవకుండా ఉండేందుకు జాగ్రత్తలు పాటించాలని కెనడా ప్రభుత్వం, టొరంటోలోని కాన్సులేట్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా అధికారులు స్పష్టం చేశారు. ప్రత్యేకంగా “మీ వీసా రద్దు అవుతుంది”, “తక్షణంగా ఫైన్‌ చెల్లించాలి”, “ఇమిగ్రేషన్‌ సమస్య ఉంది” వంటి మాటలు వినిపిస్తే అది మోసపూరిత కాల్‌గా భావించాలని సూచించారు.

అధికారులు చెబుతున్నదాని ప్రకారం, ఇలాంటి కాల్స్‌కి స్పందించకుండా వెంటనే బ్లాక్ చేయడం, స్థానిక పోలీసులకు లేదంటే సైబర్‌ క్రైమ్‌ విభాగానికి ఫిర్యాదు చేయడం ఉత్తమ మార్గమని సూచిస్తున్నారు. కెనడాలో భారతీయ కమ్యూనిటీ పెద్ద సంఖ్యలో ఉండటంతో ఈ మోసాలు మరింత పెరిగే అవకాశం ఉందని, అందుకే ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని అధికారులు మరోసారి హెచ్చరించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement