'ఆటా' కొత్త అధ్యక్షునిగా భువనేశ్ బుజాల ప్రమాణ స్వీకారం 

Bhuvanesh Boojala sworn In As The Next President In America - Sakshi

వాషింగ్టన్‌: అమెరికన్ తెలుగు అసోసియేషన్ ప్రెసిడెంట్‌గా భువనేశ్ బుజాల పదవీ బాధ్యతలు స్వీకరించారు. వాషింగ్టన్ డీసీ నివాసి అయిన భువనేశ్ 2004వ సంవత్సరం నుంచి ఆటాలో ఉత్సాహంగా పాలుపంచుకొంటున్నారు. 2014లో జరిగిన ఫిలడెల్ఫియా కన్వెన్షన్లో కోఆర్డినేటర్‌గా బాధ్యతలు నిర్వహించిన ఆయన నాశ్విల్లే నగరంలో జనవరి 16న జరిగిన 'ఆటా' కార్యవర్గ సమావేశంలో ప్రెసిడెంట్ పదవిని స్వీకరించారు. 

డిసెంబర్ మాసంలో జరిగిన ఎన్నికల్లో ఆటా బోర్డు ఆఫ్ ట్రస్టీస్‌గా జయంత్ చల్లా, కాశీ విశ్వనాధ్ కొత్త, పరశురాం పిన్నపురెడ్డి, శారద సింగిరెడ్డి, సోమశేఖర్ నల్ల, తిరుపతి రెడ్డి ఎర్రంరెడ్డి, హనుతిరుమల్ రెడ్డి, ప్రశీల్ గూకంటి, రఘువీర్ రెడ్డి, రామ్ అన్నాడీ , రవీందర్ గూడూర్, రింద సామ, శరత్ వేముల, సుధీర్ బండారు & విజయభాస్కర్ తూపల్లి ఎన్నికయ్యారు. ఇక ఆటా ప్రెసిడెంట్‌గా భువనేశ్ భూజాల, సెక్రటరీగా హరిప్రసాద్ రెడ్డి లింగాల, ట్రెజరర్‌గా సాయినాథ్ రెడ్డి బోయపల్లి, జాయింట్ సెక్రటరీగా రామకృష్ణ రెడ్డి ఆలా, జాయింట్ ట్రెజరర్‌గా విజయ్ కుందూరు ఎన్నిక అయ్యారు.

నష్విల్లె నగరంలో జరిగిన ఆటా బోర్డు మీటింగ్‌లో నూతన కార్యవర్గం పదవీ బాధ్యతలు స్వీకరించింది.  తదుపరి ప్రెసిడెంట్‌గా మధు బొమ్మినేని ఎన్నికయ్యారు. ఇక ప్రెసిడెంట్ భువనేశ్ మాట్లాడుతూ.. ఆటా ఎమర్జెన్సీ సర్వీసెస్‌ను అమెరికా సంయుక్త రాష్ట్రాలలోని ప్రతి రాష్ట్రానికి విస్తరిస్తున్నామని చెప్పారు. ఆపదలో ఉన్న తెలుగు వారు ఆటా సేవ 1-844-ATA-SEVA టోల్ ఫ్రీ నెంబర్‌కి కాల్ చేయాల్సిందిగా ఆయన విజ్ఞప్తి చేశారు. ఆటా ఫౌండేషన్ ద్వారా తెలుగు రాష్ట్రాల్లో ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించబోతున్నామన్నారు. అమెరికాలో తెలుగు సంస్కృతి సంప్రదాయాలను పరిరక్షించడానికి ఆటా ఎల్లప్పుడూ పెద్ద పీఠ వేస్తుందని పేర్కొన్నారు. మన మాతృభూమిలో సేవా కార్యక్రమాలు నిర్వహించాలనుకునే ప్రవాసులు ఆటాను సంప్రదించాలని విజ్ఞప్తి చేశారు. సంస్థ నిర్వహణ కార్యక్రమంలో అమెరికాలో పుట్టిపెరిగిన మన పిల్లలను భాగస్వాములను చేయడానికి తగు సూచనలు సలహాలు ఇవ్వాల్సిందిగా ఆయన బోర్డును కోరారు. యూత్  కమిటీ ఏర్పాటు చేశారు.

మొట్ట మొదటసారిగా ఆటా కన్వెన్షన్ అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీ నగరంలో 2022 సంవత్సరంలో జులై 1 నుంచి 3 తేదీలలో నిర్వహిస్తున్నామని అందరూ తప్పక పాలుపంచుకోవాలన్నారు. కోవిడ్‌-19 సమయంలో సహాయక చర్యలు, సంస్థ బాధ్యతలు ఎంతో సమర్ధవంతంగా నిర్వహించి పదవీ విరమణ చేసిన పరమేష్ భీంరెడ్డికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. అనంతరం ఎన్నికలు సమర్థవంతంగా నిర్వహించిన రవి పట్లోళ్ల, మాజీ ప్రెసిడెంట్ కరుణాకర్ ఆసిరెడ్డిని బోర్డు అభినందించింది. నాశ్విల్లే నగరంలో ఆతిధ్యం ఇచ్చిన ఆటా సభ్యులకు బోర్డు పేరు పేరునా కృతజ్ఞతలు తెలిపింది. అలాగే ఆటాకి తోడ్పాటునందిస్తున్న లోకల్ ఆర్గనైజషన్స్‌ను బోర్డు కొనియాడింది.

Read latest NRI News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top