తాగునీటికే రిజర్వ్‌.. | - | Sakshi
Sakshi News home page

తాగునీటికే రిజర్వ్‌..

Nov 24 2026 1:42 AM | Updated on Nov 24 2026 1:42 AM

జలాశయాల్లో వేగంగా తగ్గుతున్న నీటి నిల్వలు

సాక్షి ప్రతినిధి, నిజామాబాద్‌: జిల్లాలోని ప్రధాన సాగునీటి ప్రాజెక్టుల్లో నీటి నిల్వ వేగంగా తగ్గుతోంది. శ్రీరామ్‌సాగర్‌ ప్రాజెక్టులో గతేడాది ఈ సమయానికి ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 80.501 టీఎంసీలకు నిండి కళకళలాడింది. ఈసారి తీవ్ర వర్షాభావ పరిస్థితుల కారణంగా ప్రాజెక్టులోకి నీటి ప్రవాహం కరువైంది. ప్రస్తుతం జలాశయంలో 33 టీఎంసీలకు నీరు పరిమితమైంది. నిజాంసాగర్‌ జలాశయంలోనూ పూర్తిస్థాయి సామర్థ్యం 17.802 టీఎంసీలకు గాను ప్రస్తుతం 9 టీఎంసీల నీరు మాత్రమే మిగిలిఉంది. ఈ నేపథ్యంలో ఎట్టిపరిస్థితుల్లోనూ ఆయకట్టుకు నీటి విడుదల ఉండబోదని ప్రభుత్వం చెబుతోంది. అలాగే జలాశయాల్లో నీటినిల్వ తక్కువ ఉన్న నేపథ్యంలో అధికారులు తాగునీటికే ప్రాధాన్యమిస్తూ వినియోగించనున్నారు. ఒకవైపు ప్రభుత్వం, అధికారులు నీటి విడుదలపై స్పష్టంగా చెబుతున్నా జిల్లాలో మాత్రం వరిసాగు, ఇతర పంటల సాగు కొనసాగుతోంది.

ప్రణాళిక సిద్ధం

జలాశయాల్లోని నీటి నిల్వలను దృష్టిలో ఉంచుకుని అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ఇప్పటికే మున్సిపల్‌, రెవెన్యూ, ఇరిగేషన్‌, మిషన్‌ భగీరథ అధికారులతో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు, తాగునీటి సరఫరాపై ప్రణాళిక సిద్ధమైంది. ప్రస్తుతం ఉన్న కొ ద్దిపాటి నిల్వలను సాగునీటికి వినియోగించకుండా కేవలం తాగునీటి అవసరాలకే రిజర్వ్‌ చేయనున్నా రు. గత వానాకాలం సీజన్‌లో నిజాంసాగర్‌ ప్రాజెక్టుతోపాటు గుత్ప, అలీసాగర్‌ ఎత్తిపోతల ద్వారా చివరి దశలో ఉన్న పంటలకు సాగునీరందించారు. ఈసారి ఎట్టిపరిస్థితుల్లోనూ సాగునీటి విడుదల ఉండదని అధికారులు చెబుతున్నారు. వచ్చే ఏడాది జూలై వరకు ప్రస్తుతం నిల్వ ఉన్న నీటినే వినియో గించాల్సి ఉండడంతో, అప్పటివరకు నీటి సంరక్షణ, తాగునీటి ఏర్పాట్లపై ప్రత్యేక కార్యాచరణ చేపట్టనున్నారు. జలాశయాల్లో నీటినిల్వను డెడ్‌స్టోరేజీకి చేరకుండా సంరక్షించడం అధికారులకు సవాలుగా మారనుంది.

పట్టణాల్లో ఇప్పటికే కటకట..

జిల్లాకేంద్రంతోపాటు పట్టణప్రాంతాల్లో ఇప్పటికే తాగునీటి సమస్య తలెత్తుతోంది. భూగర్భజల మ ట్టం పడిపోతుండడంతో సమస్య మరింత తీవ్రమవుతోంది. మిషన్‌ భగీరథ పైప్‌లైన్‌ లేనిచోట తాగునీరు, ఇంటి అవసరాలకు నీరు సరిపోక జనం ఇ బ్బందులు పడుతున్నారు. జిల్లాకేంద్రంలోని నాగారం, రాజీవ్‌ గృహకల్ప, దొడ్డి కొమురయ్య కాలనీ త దితర ప్రాంతాల్లో తాగునీటి సమస్య నెల కొంది. మిషన్‌ భగీరథ నీటిపైనే పట్టణవాసులు ఎక్కువగా ఆధారపడాల్సి వస్తుండగా, చాలా చోట్ల నీటి సరఫరా కొనసాగడం లేదు. రానున్న రోజుల్లో భగీరథ నీటి సరఫరాపైనే ఎక్కువగా భారం పడనుంది.

బోరున్నా చివరికి కష్టకాలమే!

ఓవైపు యాసింగి సీజన్‌లో సాగునీటి విడుదల ఉండబోదని ప్రభుత్వం స్పష్టంగా చెబుతున్నా మరోవైపు జిల్లాలో వరిసాగు చేసేందుకు రైతులు సిద్ధమవుతున్నారు. వరికి బదులుగా ఇతర ప్రత్యామ్నాయ పంటలు, పప్పు దినుసులు, ఆరుతడి పంటలు వేసుకోవాలని అధికారులు చెబుతున్నా రైతులు వరి సాగుకు మొగ్గుచూపుతున్నారు. ఇప్పటికే వర్ని, ఎడపల్లి, నందిపేట్‌ తదితర మండలాల్లో వరి సాగుకోసం నారుమడులను సిద్ధం చేసుకున్నారు. బోరుబావుల ఆధారంగా పంటలు పండించుకుంటామని రైతులు ఆశపడుతున్నా చివరి దశలో పంటలకు నష్టం తప్పదని అధికారులు హెచ్చరిస్తున్నారు. పంటలకు అధిక నీటివినియోగంతో భూగర్భ జలాలు అడుగంటి చివరి దశలో బోరుబావులు కూడా ఎండిపోయేపరిస్థితి ఉంటుందని అంటున్నారు.

శ్రీరామ్‌సాగర్‌ ప్రాజెక్టులో

33 టీఎంసీలకే పరిమితం

నిజాంసాగర్‌లో 9 టీఎంసీలకు తగ్గిన నీరు

ప్రాజెక్టుల్లో నీరు లేకున్నా కొనసాగుతున్న వరి సాగు పనులు

ఇప్పటికే పట్టణాల్లో మొదలైన నీటి ఎద్దడి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement