కమ్మర్పల్లి(భీమ్‌గల్): భీమ్‌గల్ లింబాద్రి గుట్టపై కార్తీక మాస బ్రహ్మోత్సవాల్లో వైభవంగా కొనసాగుతున్నాయి. సోమవారం రాత్రి లక్ష్మీనరసింహస్వామి డోలారోహణాన్ని నిర్వహించారు. ఉత్సవమూర్తులను సీతానగరిలోని పురాతన నాలుగు స్తంభాల రాతి మండపానికి తీసుకెళ్లి ప్రత్యేక పూజలు చేశారు. భక్తి సంకీర్తనల నడుమ ఉయ్యాల సేవ నిర్వహించడంతో నింబాచల క్షేత్రంపై ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. తిరుగు ప్రయాణంలో జోడు లింగాల వద్ద ఉత్సవమూర్తులను నిలిపి భక్తులకు ప్రత్యేక దర్శనం కల్పించారు. ఒకే ప్రాంతంలో హరిహరులను దర్శించుకునే ఈ పురాతన సంప్రదాయం బ్రహ్మోత్సవాల్లో ప్రత్యేక ఆధ్యాత్మిక ప్రాధాన్యతను సంతరించుకుంది.
నేడు జాతర, రథోత్సవం
లింబాద్రిగుట్టపై మంగళవారం జాతర, రథోత్సవాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. భక్తులు భారీ సంఖ్యలో తరలిరానున్న నేపథ్యంలో పోలీసులు వాహనాల రాకపోకల కోసం ప్రత్యేక రూట్ మ్యాప్ రూపొందించారు. వాహనాలు జామ్ కాకుండా ట్రాఫిక్ మళ్లింపు చర్యలు చేపడుతున్నారు. వాహనాలు భీమ్‌గల్ నుంచి పురాణీపేట్ మీదుగా లింబాద్రి గుట్టకు చేరుకోవాలి. అలాగే లింబాద్రి గుట్ట నుంచి పల్లికొండ, లింగాపూర్ మీదుగా భీమ్‌గల్ వైపు వెళ్లాల్సి ఉంటుంది. భారీ వాహనాలు పల్లికొండ, పిప్రి, ముచ్కూర్, బెజ్జోర గ్రామాల మీదుగా భీమ్‌గల్ చేరుకోవాలి. ముగ్గురు ఏసీపీలు, ఆరుగురు సీఐలు, 23 మంది ఎస్సైల పర్యవేక్షణలో 51 మంది ఏఎస్ఐలు, హెడ్ కానిస్టేబుళ్లు, 291 మంది పురుష, మహిళ కానిస్టేబుళ్లు, 115 మంది హోమ్‌గార్డులు, నాలుగు స్పెషల్ పార్టీ పోలీసులు బందోబస్తు విధులు నిర్వర్తించనున్నారని సీఐ పొన్నం సత్యనారాయణగౌడ్ తెలిపారు.


