● జిల్లాలో ఔషధ మొక్కల సాగుకు
అనువైన నేలలు
● జాతీయ ఔషధ మొక్కల నిపుణుడు ప్రొఫెసర్ టి శేఖర్
బోధన్: దేశీయ వైద్యంలో శతావరి ఔషధ మొక్క లకు ఎంతో ప్రాధాన్యత ఉందని జాతీయ ఔషధ మొక్కల నిపుణుడు ప్రొఫెసర్ టి శేఖర్ అన్నారు. ఆయుర్వేద వైద్యంలో, మార్కెట్‌లో శతావరికి భారీ డిమాండ్ ఉందన్నారు. జాతీయ ఔషధ మొక్కల మండలి ఆర్థిక సహకారంతో ఉస్మానియా యూనివర్సిటీ వృక్ష విభాగం అధ్వర్యంలో సోమవారం పట్టణంలోని ఫార్మర్ రిక్రియేషన్ క్లబ్‌లో శతావరి ఔషధ పంటసాగుపై రైతు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా శేఖర్ మాట్లాడుతూ.. ఔషధ మొక్కల సాగుకు జిల్లాలో అనువైన నేలలు, వాతావరణ పరిస్థితులున్నాయని, కేంద్ర ప్రభుత్వం ఔషధ పంటల సాగుకు ఎంతో ప్రొత్సహిస్తోందని పేర్కొన్నారు. ఉస్మానియా యూనివర్సిటీ బోటనీ విభాగం ప్రొఫెసర్, ప్రాజెక్టు కన్వీ నర్ డాక్టర్ ఇ సుజాత మాట్లాడుతూ.. శాసీ్త్రయ పరిశోధన ఫలితాలు రైతలుకు చేరువ చేయడం, శతావరి వంటి ఔషధ మొక్కల సాగును ప్రొత్సహించడం ప్రాజెక్టు ప్రధాన లక్ష్యమని అన్నారు. ఔషధ మొక్కల సాగుతో రైతులకు నూతన అవకాశాలు కలుగుతాయన్నారు. రైతులతో ముఖాముఖి నిర్వహించారు. శతావరి సాగు, పంట సంరక్షణ, నాణ్యత, మార్కెటింగ్‌కు సంబంధించిన అంశాలను వివరించడంతోపాటు రైతుల సందేహాలను నివృత్తి చేశారు. అనంతరం శతావరి ఔషధ మొక్కలను పంపిణీ చేశారు. జిల్లా ఉద్యాన శాఖ అధికారి శ్రీనివాస్, ఆయుర్వేద వైద్యులు రామచంద్రం, సీఎస్‌ఐఆర్ –ఐఐసీటీ సీనియర్ ప్రిన్సిపాల్ సైంటిస్ట్ డాక్టర్ కె సురేశ్‌బాబు, అఖిల భారతీయ రాష్ట్రీయ శైక్షిక్ మహాసంఘ్ జాతీయ సంయుక్త సంఘటనా కార్యదర్శి గుంత లక్ష్మణ్, పట్టణ ప్రముఖులు, రైతులు పాల్గొన్నారు.


