● విరాళాలు అందించి గోశాలలను ప్రోత్సహించాలి
● ఆధ్యాత్మిక ప్రవచనకర్త
చాగంటి కోటేశ్వరరావు
కామారెడ్డి అర్బన్: సృష్టిలో అత్యంత పవిత్రమైన జీవి గోమాత అని ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు పేర్కొన్నారు. కామారెడ్డి స్వామి అయ్యప్ప సేవా సంఘం, అన్నప్రసాద సేవా సమితి ఆధ్వర్యంలో బుధవారం సాయంత్రం పట్టణంలోని శ్రీసరస్వతి విద్యామందిర్ హైస్కూల్ మైదానంలో గోమాత వైభవంపై చాగంటి ప్రవచన కార్యక్రమం నిర్వహించారు. ముందుగా చాగంటి సరస్వతి మాత, గోమాతలకు పూజలు చేశారు. అనంతరం ఆయన గోమాత వైభవాన్ని డిజిటల్ తెరపై ప్రదర్శిస్తూ వివరించారు. గోమాత పవిత్రత గురించి ఎంత చెప్పినా తక్కువేనన్నారు. ఆవు పాలు, పెరుగు, నెయ్యి, మూత్రం, పేడ అన్నీ పవిత్రమైనవేనని శాసీ్త్రయంగా రుజువైందన్నారు. ప్రకృతి వ్యవసాయంలోనూ గోమాత ప్రధానమైందన్నారు. గోమాత రక్షణ కోసం తల రూపాయి విరాళం అందజేసి గోశాలలను ప్రోత్సాహించాలని కోరారు. సనాతన ధర్మంలో గోవు విశిష్టత, గోమాతను దైవస్వరూపంగా భావించడానికి గల పురాణ ప్రాధాన్యతలను వివరించారు.
గోమాతకు పూజలు చేస్తున్న చాగంటి కోటేశ్వరరావు.. కార్యక్రమంలో పాల్గొన్న ప్రజలు
తరలివచ్చిన భక్తులు..
చాగంటి ప్రవచనాలను వినేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. దీంతో శ్రీసరస్వతి విద్యామందిర్ హైస్కూల్ ప్రాంగణం కిక్కిరిసిపోయింది. పోలీసులు పటిష్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. వేదిక వద్దకు ఎవరినీ అనుమతించలేదు. గురువారం సాయంత్రం కార్తీక మాస వైభవం అంశంపై ప్రవచనాలు ఉంటాయని నిర్వాహకులు తెలిపారు.


