కమ్మర్‌పల్లి(భీమ్‌గల్): భీమ్‌గల్ పరిధిలోని ప్రముఖ పుణ్యక్షేత్రం లింబాద్రిగుట్టపై లక్ష్మీనృసింహస్వామివారి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా బుధవారం రాత్రి స్వామివారి ఎదుర్కోలు మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. స్వామివారి ఉత్సవ విగ్రహాలను స్వర్ణాభరణాలతో సర్వాంగసుందరంగా అలంకరించారు. పుష్పమాలికలతో అలంకరించిన పల్లకీలో మంగళవాయిద్యాల నడుమ గర్భాలయం నుంచి కల్యాణ మండపానికి తీసుకొచ్చారు. అనంతరం స్వామివారిని పుష్కరిణి పురవీధుల మీదుగా ఊరేగింపుగా ఆంజనేయస్వామి ఆలయం వద్దకు చేర్చారు. అదే సమయంలో లక్ష్మీఅమ్మవారిని పల్లకీలో స్వామివారి సన్నిధికి తీసుకొచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గోవిందనామస్మరణతో గుట్ట ప్రాంగణం మార్మోగింది.


