వేల్పూర్: బహ్రెయిన్ దేశంలో ఆస్పత్రిలో ఉన్న తన కొడుకు గోపి రూపేష్‌ను స్వదేశానికి రప్పించాలని వేల్పూర్ మండలం పచ్చలనడ్కుడ గ్రామానికి చెందిన లక్ష్మి సీఎం రేవంత్‌రెడ్డి పేరిట ఎన్ఆర్ఐ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రజావాణిలో వినతిపత్రం అందజేశారు. తన కుమారుడు ఇటీవల బహ్రెయిన్‌లో మూడంతస్తుల భవనంపై నుంచి పడ్డాడని, దాంతో అతనికి కాళ్లు చేతులు విరిగి తీవ్ర గాయాల పాలైనట్లు పేర్కొన్నారు. ఈనెల 4న జారీ చేసిన వైద్య నివేదిక ప్రకారం తన కుమారుడు స్పృహలో ఉన్నప్పటికీ, మానసిక అయోమయ స్థితిలో ఉన్నాడని, శస్త్ర చికిత్సకు సంబంధించిన పలు గాయాలు ఉన్నందున నిరంతర పర్యవేక్షణ, సహాయం అవసరమని పేర్కొన్నారు. తన కొడుకును బహ్రెయిన్ నుంచి సురక్షితంగా స్వదేశానికి తీసుకురావడానికి తెలంగాణ ప్రభుత్వం చొరవచూపాలని కోరారు. పచ్చలనడ్కుడకు చెందిన రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ అన్వేష్‌రెడ్డి చొరవతో తెలంగాణ ప్రభుత్వ ఎన్ఆర్ఐ అడ్వయిజరి కమిటీ వైస్ చైర్మన్ మంద భీంరెడ్డి ఆధ్వర్యంలో ఆమె ఫిర్యాదు చేశారు.


