నిజామాబాద్ అర్బన్ : ప్రతి కుటుంబానికి ఆర్థిక భద్రత కల్పించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయనున్న ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి కోరారు. దరఖాస్తుల స్వీకరణ, అవగాహన కార్యక్రమాలు తదితర అంశాలపై మంగళవారం కలెక్టరేట్‌లో సమీక్షాసమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఇందిరమ్మ కుటుంబ జీవితబీమాపై విస్తృత స్థాయిలో అవగాహన కల్పిస్తూ, ప్రతి కుటుంబం వినియోగించుకునేలా సమన్వయంతో పని చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ నెల 19వ తేదీ నుంచి గ్రామ పంచాయతీలు, మున్సిపల్ వార్డుల వారీగా దరఖాస్తులను స్వీకరించేందుకు ఏర్పాట్లు పూర్తి చేయాలని అన్నారు. ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల జీవిత బీమా వర్తించనుందని, కుటుంబంలో జీవనోపాధికి ప్రధానంగా ఆధారపడే వ్యక్తికి బీమా వర్తించేలా నమోదు ప్రక్రియ చేపట్టాలని సూచించారు. కులం, మతం, ఆదాయ పరిమితులతో సంబంధం లేకుండా కుటుంబాలకు జీవిత బీమా భద్రత కల్పించడమే లక్ష్యమని పేర్కొన్నారు. 18 నుంచి 59 ఏళ్ల వయస్సున్న వారు బీమా పథకం పరిధిలోకి వస్తారని, రేషన్ కార్డు ఉన్న కుటుంబాలతోపాటు కార్డు లేని కుటుంబాల వివరాలను కూడా ప్రభుత్వ సర్వే, అందుబాటులో ఉన్న కుటుంబ డేటా ఆధారంగా పరిశీలించి దరఖాస్తుల స్వీకరణ, నమోదు ప్రక్రియను నిర్వహించాలని అధికారులకు మార్గనిర్దేశం చేశారు. ఒకరి కన్నా ఎక్కువ మందిని నామినీలుగా ఎంపిక చేసిన సందర్భంలో బీమా మొత్తాన్ని తమకు నచ్చిన విధంగా పంపిణీ చేసే వివరాలను సైతం నమోదు చేసుకునే అవకాశం ఉందని తెలిపారు. ప్రభుత్వం కల్పిస్తున్న ఈ అవకాశాన్ని జిల్లాలోని అర్హత కలిగిన ప్రతి కుటుంబం సద్వినియోగం చేసుకునేలా అధికారులు అంకితభావంతో కృషి చేయాలని సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు రాజాగౌడ్, భుజంగరావు, జెడ్పీ సీఈవో సాయాగౌడ్, సీపీవో రతన్, ఇన్‌చార్జి డీపీవో నాగరాజు, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.
ఇందిరమ్మ కుటుంబ జీవితబీమాను
సద్వినియోగం చేసుకోవాలి
ఈనెల 19 నుంచి దరఖాస్తుల స్వీకరణ
సమీక్షాసమావేశంలో
కలెక్టర్ ఇలా త్రిపాఠి
పక్కాగా ఏర్పాట్లు చేయాలని
అధికారులకు ఆదేశాలు


