అన్నీ ఉన్నా ఓపీ సేవలే.. | - | Sakshi
Sakshi News home page

అన్నీ ఉన్నా ఓపీ సేవలే..

Nov 18 2026 1:26 AM | Updated on Nov 18 2026 1:26 AM

ఓపీ రోగులే ఎక్కువ

సాక్షి ప్రతినిధి, నిజామాబాద్‌ : జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రి ఆవరణలో ఉన్న పాలియేటివ్‌ కేర్‌ సెంటర్‌లో కేన్సర్‌ బాధితులకు చికిత్స అందుబాటులోకి వచ్చింది. కేన్సర్‌ బాధితులకు ఉపశమయం కలిగించే చికిత్సతోపాటు కీమోథెరపీ సైకిల్స్‌ వైద్యసేవలను సైతం ఇక్కడి వైద్యులు అందిస్తున్నారు. కేన్సర్‌తోపాటు దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు వ్యాధి లక్షణాల నుంచి ఉపశమనం కలిగించడంతోపాటు బాధితులకు నొప్పి బాధల నుంచి సాంత్వన కలిగించేందుకు పాలియేటిక్‌ కేర్‌ సెంటర్‌ పనిచేస్తోంది. ప్రస్తుతం ఇక్కడికి కేన్సర్‌, పక్షవాతం, సెలబ్రల్‌ స్ట్రోక్‌ తదితర బాధితులు చికిత్స కోసం వస్తున్నా కేవలం ఓపీ సేవలకే పరిమితమవుతున్నారు. పాలియేటివ్‌ కేర్‌ సెంటర్‌లో అడ్మిట్‌ అయ్యేందుకు ఆసక్తి చూపడం లేదు. మార్చురీ(శవ పరీక్షల గది) పక్కనే ఈ కేంద్రాన్ని నిర్వహిస్తుండటంతో ఇన్‌పేషెంట్‌లుగా చేరేందుకు జంకుతున్న పరిస్థితి నెలకొంది. దీంతో అధునాతన సౌకర్యాలు ఉన్నా పూర్తిస్థాయిలో సేవలు వినియోగంలోకి రావడం లేదు.

కేన్సర్‌ చికిత్స అందుబాటులోకి వచ్చినా..

పాలియేటివ్‌ కేర్‌ సెంటర్‌ ద్వారా అవసరమైన వారికి ఇంటికి వెళ్లి హోం కేర్‌ వైద్యసేవలను అందిస్తున్నారు. వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉండి మంచానికే పరిమితమైన వారిని వైద్యులు, సిబ్బంది వారి ఇంటి వద్దకే వెళ్లి చికిత్స అందిస్తున్నారు. ఏ సమయంలో ఎవరి ఇంటికి వెళ్లి చికిత్స అందించాలన్న విషయంలో రోజూవారీ షెడ్యూల్‌ను ముందస్తుగానే నిర్దేశిస్తారు. ఈ మేరకు సంబంధిత వైద్య సిబ్బంది ఆయా బాధితుల ఇంటికి వెళ్లి పాలియేటిక్‌ కేర్‌ చికిత్సను అందిస్తున్నారు. అయితే ఈ సేవలు మంచానికే పరిమితమైన వారు, వృద్ధులు తదితర కొద్ది మందికే పరిమితమవుతున్నాయి. పాలియేటివ్‌ కేంద్రానికి వస్తున్న అవుట్‌ పేషెంట్‌లు నెలకు 150 మందికి పైగా ఉంటుండగా, ఇన్‌ పేషంట్లుగా మాత్రం ఒకరిద్దరు కూడా ఉండటం లేదు. హైదరాబాద్‌లోని ఎంఎన్‌జే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న జిల్లావాసులను కీమోథెరపీ కోసం ఇక్కడి రిఫర్‌ చేస్తున్నారు. ఈ క్రమంలో కొద్ది రోజులపాటు పాలియేటివ్‌ కేంద్రంలోనే ఉండి చికిత్స పొందాల్సి ఉండగా, బాధితులు మాత్రం ఓపీ సమయంలో చికిత్స తీసుకుని ఇంటికి వెళ్తున్నారు.

పాలియేటివ్‌ కేర్‌ సెంటర్‌లో కేన్సర్‌ రోగులకు కీమో సైకిల్స్‌ చికిత్స అందిస్తున్నాం. ఫిజియోథెరపీ సేవ లు అందుబాటులో ఉన్నాయి. పక్షవాతం, కేన్సర్‌, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు చికిత్స అందిస్తున్నాం. ఎక్కువగా ఓపీ రోగులే ఉంటున్నారు. మార్చురీ సమస్యను ఉన్నతాధికారులకు నివేదించాం.

– డాక్టర్‌ చైతన్య రెడ్డి, పాలియేటివ్‌ కేర్‌, జీజీహెచ్‌

కేన్సర్‌, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు

అండగా పాలియేటివ్‌ కేర్‌ ఏర్పాటు

మార్చురీ పక్కనే ఏర్పాటు

భయం, దుర్వాసన కారణంగా

ఉండలేకపోతున్న రోగులు

వసతులు ఉన్నా పాలియేటివ్‌

కేంద్రానికి తగ్గుతున్న ఇన్‌పేషెంట్‌లు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement