తెయూ(డిచ్‌పల్లి): యువతలో సామాజిక బాధ్యత, నాయకత్వ లక్షణాలు, సేవా దృక్పదం పెంపొందినప్పుడే సమాజం అభివృద్ధి పథంలో ముందుకు సాగుతుందని తెలంగాణ యూనివర్సిటీ టీచర్స్ అసోసియేషన్ (టూటా) అధ్యక్షుడు ఎ పున్నయ్య అన్నారు. అంతర్జాతీయ విద్యార్థి దినోత్సవాన్ని పురస్కరించుకొని తెయూ ఎన్‌ఎస్‌ఎస్ యూనిట్–1 ఆధ్వర్యంలో ‘యువ సంకల్పం – సమాజ వికాసం’ అనే నినాదంతో మంగళవారం నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. విద్యార్థులు కేవలం విద్యాభ్యాసానికే పరిమితం కాకుండా సామాజిక సమస్యలపై అవగాహన పెంపొందించుకొని వాటి పరిష్కారంలో చురుకై న పాత్ర పోషించాలని సూచించారు. ఎన్‌ఎస్‌ఎస్ యూనిట్–1 ప్రోగ్రాం ఆఫీసర్ సీహెచ్ శ్రీనివాస్, అధ్యాపకులు దత్తహరి, రామలింగం, నర్సయ్య, ప్రవీణ్, వలంటీర్లు తదితరులు పాల్గొన్నారు.


