● ఆరుతడి పంటల సాగు కోసం సబ్సిడీపై అందించాలంటున్న రైతులు
● క్షేత్రస్థాయిలో వివరాలు సేకరిస్తున్న
వ్యవసాయాధికారులు
డొంకేశ్వర్(ఆర్మూర్): యాసంగి సీజన్‌లో ఆరుతడి పంటలు సాగు చేయడానికి రైతులకు ప్రభుత్వం నుంచి ఎలాంటి సౌకర్యాలు, సహాయం కావాలని వ్యవసాయ శాఖ వివరాలను సేకరిస్తోంది. కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా ఏఈవోలు, ఏవోలు క్షేత్రస్థాయిలో రైతుల వద్దకు వెళ్లి వివరాలను నమోదు చేస్తున్నారు.
వరిని వదులుకుని.. పప్పు
దినుసులతోపాటు జొన్నలు, వేరు శనగ, శనగ, నువ్వులు, కుసుమలు, పొద్దుతిరుగుడు, కూరగాయలు సాగు చేసేందుకు తమకు సబ్సిడీపై విత్తనాలు అందజేయాలని రైతులు వ్యవసాయాధికారులను కోరుతున్నారు. అలాగే నీటి పొదుపు కోసం డ్రిప్ ఇరిగేషన్ పరికరాలు, అడవి పందులు, కోతుల బెడద నుంచి పంటను రక్షించుకునేందుకు సోలార్ ఫెన్సింగ్, ఇతర మౌలిక సౌకర్యాలు రాయితీపై కల్పించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. రైతుల నుంచి సేకరించిన వివరాలు, వారికి కావాల్సిన విత్తనాలు, పరికరాల డిమాండ్‌నుఽ అధికారులు ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో నమోదు చేసి ప్రభుత్వానికి పంపుతున్నారు. ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా 3,838 మంది రైతులు ముందుకు రాగా.. 9,046 ఎకరాల్లో తక్కువ నీటితో సాగయ్యే ఆరుతడి పంటలను వేస్తామని వివరాలు నమోదు చేసుకున్నారు. మరింత మంది రైతులు ముందుకు వచ్చేలా వ్యవసాయాధికారులు క్షేత్రస్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే, సేకరించిన వివరాల ప్రకారం రైతులకు రానున్న రోజుల్లో సబ్సిడీపై విత్తనాలు, పరికరాలు అందించి ప్రోత్సహించే అవకాశం ఉంటుందని అధికారులు అంటున్నారు. ఇటు ఇప్పటికే జిల్లాలో 40,613 ఎకరాల్లో ఆరుతడి పంటలు సాగవుతుండగా, ఇందులో అత్యధికంగా మొక్కజొన్న 10,869 ఎకరాల్లో ఉంది. అలాగే శనగ 6,802 ఎకరాల్లో, జొన్న 2,960 ఎకరాలు, పొద్దు తిరుగుడు 815 ఎకరాలు, మిగతా విస్తీర్ణంలో ఇతర పంటలు సాగవుతున్నాయి.
ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆరుతడి పంటలు సాగు చేసే రైతులకు ఎలాంటి సౌకర్యాలు కావాలనే వివరాలను వ్యవసాయ శాఖ సేకరిస్తోంది. ఇప్పటికే చాలా మంది ముందుకొచ్చి వారికి కావాల్సిన సౌకర్యాలేమిటో వివరాలు నమోదు చేసుకున్నారు. మరింత మంది రైతులు ముందుకురావాలి. స్థానిక ఏఈవోలు, ఏవోలను కలిసి వివరాలిస్తే సరిపోతుంది.
– వీరాస్వామి, జిల్లా వ్యవసాయాధికారి


