ఆర్వోబీల గతేమిటో? | - | Sakshi
Sakshi News home page

ఆర్వోబీల గతేమిటో?

Nov 18 2026 1:26 AM | Updated on Nov 18 2026 1:26 AM

పనులు ప్రారంభించాలి

బోధన్‌: రైల్వే క్రాసింగ్‌లు ప్రయాణికులకు నిత్య నరకాన్ని చూపిస్తున్నాయి. రైళ్ల రాకపోకల సమయంలో గేట్లు మూసివేయడంతో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోతున్నాయి. ఏళ్లుగా ఆర్వోబీల నిర్మాణ ప్రతిపాదనలు, సర్వేలకే పరిమితం కావడంతో ప్రజలకు ఎదురుచూపులు తప్పడం లేదు. బోధన్‌, ఎడపల్లి, నవీపేట మండల కేంద్రాల్లో ఈ సమస్య తీవ్రంగా ఉంది.

బోధన్‌ పట్టణంలోని గాంధీపార్కు రైల్వే గేటు వద్ద ఆర్వోబీ నిర్మాణానికి 2024 సెప్టెంబరులో ప్రధాని నరేంద్రమోదీ వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు. ఎంపీ ధర్మపురి అర్వింద్‌, ఎమ్మెల్యే పొద్దుటూరి సుదర్శన్‌రెడ్డి తదితరులు పాల్గొని శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. అయినప్పటికీ రెండేళ్లు గడుస్తున్నా పనులు ప్రారంభం కాకపోవడంపై ప్రజల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది.

ఇక నిజామాబాద్‌–బాసర ప్రధాన రహదారిపై నవీపేట, బోధన్‌–నిజామాబాద్‌ మార్గంలోని ఎడపల్లి రైల్వే క్రాసింగ్‌ల వద్ద కూడా ఇదే పరిస్థితి నెలకొంది. రైళ్ల రాకపోకల సమయంలో వాహనాలు బారులు తీరుతున్నాయి. అత్యవసర పనులపై వెళ్లేవారు, విద్యార్థులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ ప్రాంతాల్లో ఆర్వోబీల ప్రతిపాదనలు ముందుకు సాగకపోవడంపై ప్రజాప్రతినిధుల తీరుపై విమర్శలు వినిపిస్తున్నాయి.

పెరిగిన రద్దీ.. తప్పని తిప్పలు

బోధన్‌ పట్టణం విస్తరించడంతో జనాభా, వాహనా ల సంఖ్య గణనీయంగా పెరిగింది. దీంతో గాంధీపార్కు రైల్వే గేటు వద్ద నిత్యం ట్రాఫిక్‌ సమస్య ఏర్పడుతోంది. ప్రయాణికుల రాకపోకలతో పాటు ఎఫ్‌సీఐ గోదాం నుంచి ఇతర రాష్ట్రాలకు బియ్యం రవాణా చేసే గూడ్స్‌ రైళ్ల రాకపోకలు కూడా కొనసా గుతున్నాయి. రైలు వచ్చే ప్రతిసారీ గేటు మూసివేయడంతో వాహనదారులు నిరీక్షించాల్సి వస్తోంది.

ఆర్‌యూబీ పనులతో ప్రత్యామ్నాయ బాట

మరోవైపు బోధన్‌ హనుమాన్‌ టేకిడి కాలనీ సమీపంలో ఆర్‌యూబీ నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. నవీపేట మండలంలోని ధర్మారం, మహంతం, ధర్యాపూర్‌, నాగేపూర్‌ రైల్వే గేట్ల వద్ద కూడా ఆర్‌యూబీల నిర్మాణాలు చేపట్టారు. ఒక్కో నిర్మాణానికి రూ.5 కోట్ల చొప్పున నిధులు మంజూరయ్యాయి. నాగేపూర్‌ వద్ద పనులు పూర్తికాగా, మిగిలిన ప్రాంతాల్లో కొనసాగుతున్నాయి. గేట్ల మూసివేతతో గ్రామాల ప్రజలు ప్రత్యామ్నాయ మార్గాల్లో ప్రయాణిస్తూ ఇబ్బందులు పడుతున్నారు.

ఏళ్లుగా ఎదురుచూస్తున్న ఆర్వోబీల నిర్మాణాలు ఎప్పుడు పట్టాలెక్కుతాయోనని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. శంకుస్థాపనలకే పరిమితం కాకుండా పనులు ప్రారంభించి రైల్వే క్రాసింగ్‌ల వద్ద ట్రాఫిక్‌ కష్టాలకు శాశ్వత పరిష్కారం చూపాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.

రైల్వే క్రాసింగ్‌ల వద్ద ప్రయాణికుల అవస్థలు..

ప్రధాని వర్చువల్‌గా శంకుస్థాపన చేసినా ప్రారంభం కాని బోధన్‌ ఆర్వోబీ పనులు

నవీపేట, ఎడపల్లిలో ప్రతిపాదనలకే

పరిమితమైన నిర్మాణాలు

పలు చోట్ల కొనసాగుతున్న ఆర్‌యూబీ పనులతో ప్రత్యామ్నాయ మార్గాల్లో పాట్లు

పట్టణ కేంద్రంలోని ప్రధాన రైల్వేక్రాసింగ్‌ వద్ద ఆర్వోబీ నిర్మాణ పనులు ప్రారంభించాలి. రైళ్ల రాకపోకల సమయంలో రైల్వేగేట్‌ వద్ద ట్రాఫిక్‌ సమస్య జఠిలంగా మారింది. వాహనదారులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. పలు చోట్ల చేపట్టిన ఆర్‌యూబీ పనులు త్వరితగతిని పూర్తి చేయాలి.

– పుట్ట వరదయ్య, సీపీఐ(ఎంఎల్‌) న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement