అన్ని గ్రామాల్లో ప్రచారం
● ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమాతో రూ. ఐదు లక్షల భరోసా
● ఈ నెల 19 నుంచి పథకం అమలుకు సన్నాహాలు
డిచ్‌పల్లి/ కమ్మర్‌పల్లి: కుటుంబ పెద్దను కోల్పోయి ఆర్థికంగా కుంగిపోయే పేద, మధ్యతరగతి కుటుంబాలకు అండగా నిలిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక పథకానికి శ్రీకారం చుట్టింది. ఇప్పటి వరకు రైతులకు మాత్రమే పరిమితమైన జీవిత బీమా సదుపాయాన్ని ఇకపై అన్ని కుటుంబాలకూ వర్తింపజేసేందుకు ‘ఇందిరమ్మ కుటుంబ జీవితా బీమా’ పథకాన్ని అమలు చేయనుంది. ఈ నెల 19న ఇంది రా గాంధీ జయంతి సందర్భంగా పథకాన్ని ప్రారంభించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది.
ఇంటింటికి వెళ్లి వివరాల సేకరణ
పథకంపై ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు అర్హులైన కుటుంబాలను గుర్తించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఇందులో భాగంగా ఈ నెల 17, 18వ తేదీల్లో అధికారులు విస్తృత ప్రచారం నిర్వహించనున్నారు. ఈ నెల 19 నుంచి అధికారు లు ఇంటింటికి వెళ్లి కుటుంబ పెద్దలు, కుటుంబ స భ్యులు, నామినీల వివరాలను సేకరించనున్నారు. ఇందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు.
సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం.. జిల్లాలో 4,96,290 కుటుంబాలు ఉన్నాయి. ఈ పథకంతో అన్ని వర్గాల కుటుంబాలకూ బీమా భరోసా కలుగనుంది. కుటుంబ యజమాని ప్రమాదవశాత్తు, అనారోగ్య సమస్యలతో చనిపోతే ఆ కుటుంబానికి రూ. ఐదు లక్షల బీమా పరిహారం అందించి అండగా నిలవడమే ఈ పథకం ఉద్దేశం.
కావాల్సిన ధ్రువపత్రాలు ఇవే..
పథకంలో వివరాల నమోదు కోసం కుటుంబ పెద్ద ఆధార్ కార్డుతో పాటు కుటుంబ సభ్యులు, నామినా ఆధార్ కార్డులను సిద్ధంగా ఉంచుకోవాలి. కుటుంబ గుర్తింపు, సభ్యుల వివరాల ధ్రువీకరణకు రేషన్‌కార్డు, నామినీ, కుటుంబ సభ్యుల బ్యాంక్ పాస్‌బుక్ జిరాక్స్ అందుబాటులో ఉంచుకోవాలి. ఆధార్‌తో అనుసంధానమైన మొబైల్ నంబర్ కూడా అవసరం. 18 నుంచి 59 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న వారికి సంబంధించిన వివరాలను నమోదు చేయనున్నారు.
ప్రతి కుటుంబానికి ఇన్సూరెన్స్ కల్పించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ నెల 19న ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని ప్రారంభించనుంది. ఈ పథకంపై గ్రామాల్లో విస్తృత ప్రచారం కల్పిస్తున్నాం. ఈ నెల 20 నుంచి 30 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నాం. ఇందు కోసం ఏర్పాట్లు చేస్తున్నాం.
– ఉదయ్‌భాస్కర్, ఎంపీడీవో, డిచ్‌పల్లి


