● బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవన్‌రెడ్డి
నిజామాబాద్‌అర్బన్: ప్రజాపాలన పేరుతో అధికారంలోని వచ్చిన కాంగ్రెస్ ప్రజలను దగా చేస్తోందని బీఆర్‌ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు జీవన్‌రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఎలాగైనా అధికారంలోకి రావాలన్న కుట్రతో అబద్ధాలు, అభూత కల్పనలతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని అన్నారు. కాంగ్రెస్ బోగస్ మ్యానిఫెస్టో కు మూడేళ్లలో ప్రజలకు కన్నీళ్లే మిగిలాయని విమర్శించారు. అమలుకాని కాంగ్రెస్ అడ్డగోలు మ్యానిఫెస్టో ప్రతులు అంటూ జీవన్‌రెడ్డి, నాయకులు వాటిని చింపేసి చెత్తబుట్టలో వేశారు. తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణను కంటికిరెప్పలా కాపాడారన్నారు. సబ్బండ వర్ణాల సంక్షేమంగా కేసీఆర్ పదేండ్ల పాలన సాగిందన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే తెలంగాణ అంతా తల్లకిందులైందన్నారు. సమావేశంలో మాజీ జెడ్పీటీసీ బాజిరెడ్డి జగన్, నాయకులు ప్రభాకర్ రెడ్డి, సిర్పరాజ్, సుజిత్ సింగ్ ఠాకూర్, సత్యప్రకాశ్, నవీద్ ఇక్బాల్, దండు శేఖర్, పూజ నరేందర్, గంగాధర్, సుంకరి రవి, కిరణ్, భరత్ తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే కార్యాలయం ఎదుట ధర్నా
సుభాష్‌నగర్: నగరంలోని సుభాష్‌నగర్‌లో ఉన్న నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఎదుట ఏఐటీయూసీ ఆధ్వర్యంలో మెడికల్ కాంట్రాక్ట్ కార్మికులు మంగళవారం ధర్నా నిర్వహించారు. అంతకుముందు జిల్లాకేంద్రాసుపత్రి, రైల్వే బ్రిడ్జి, నాందేవ్‌వాడ, హమల్‌వాడీ, సుభాష్‌నగర్ మీదుగా క్యాంపు కార్యాలయం వరకు నిరసన ర్యాలీ చేపట్టారు. అనంతరం ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణకు వినతిపత్రం అందజేశారు. సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే సమస్యను ఆరోగ్యశాఖ మంత్రి, ప్రభుత్వానికి రాతపూర్వ కంగా, మాట్లాడి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని అన్నారు. ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి వై ఓమయ్య, జిల్లా ఉపాధ్యక్షుడు చక్రపాణి, జిల్లా కార్యదర్శి గోవర్ధన్, కోశాధికారి ఫెరోజ్ అలీ, మెడికల్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ నాయకులు భాగ్యలక్ష్మి, కవిత, స్వరూప, భారతి, సాయి సుధా, పవిత్ర, సాయిరెడ్డి కార్మికులు పాల్గొన్నారు.
● వాహనదారులకు హెల్మెట్లు, గులాబీలు అందజేత
కామారెడ్డి టౌన్: రోడ్డు ప్రమాదాల నివారణపై అవగాహన కల్పించేందుకు హైదరాబాద్‌కు చెందిన ‘రోడ్ వారియర్ తెలంగాణ మిషన్’ ప్రతినిధి అరుణ్ బత్తుల చేపట్టిన 33 జిల్లాల యాత్ర మంగళవారం కామారెడ్డికి చేరుకుంది. ఈ సందర్భంగా పట్టణ ట్రాఫిక్ ఎస్‌ఐ చంద్రశేఖర్ గౌడ్ ఆయనకు స్వాగతం పలికి, నిజాంసాగర్ చౌరస్తా వద్ద వాహనదారులకు అవగాహన కల్పించారు. హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనదారులను ఆపి మర్యాదపూర్వకంగా హెల్మెట్లు, గులాబీ పువ్వులు అందజేశారు. ఈ సందర్భంగా ఎస్‌ఐ మాట్లాడుతూ.. ప్రాణాల కంటే ప్రయాణం ముఖ్యం కాదని, కుటుంబ సభ్యుల కోసం క్షేమంగా ఇంటికి చేరుకోవాలంటే ప్రతి ఒక్కరూ విధిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచించారు.


