బాన్సువాడ రూరల్: రాష్ట్రంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (పీఏసీఎస్) పునర్వ్యవస్థీకరణకు ఈనెల 11న ప్రభుత్వం అనుమతి మంజూరు చేసింది. ఈమేరకు వ్యవసాయ, సహకార శాఖ ప్రత్యేక కార్యదర్శి కె. సురేంద్ర మోహన్‌తదుపరి చర్యల కోసం సహకార శాఖ కమిషనర్ అండ్ రిజిస్ట్రార్‌కు ఆదేశాలు జారీ చేశారు.
కామారెడ్డి జిల్లాలో 6 సహకార సంఘాలు
కామారెడ్డి జిల్లాలో 6 కొత్త సొసైటీలను ప్రతిపాదించారు. వీటిలో కామారెడ్డి పరిధిలో చిన్నమల్లారెడ్డి, లింగంపేట పరిధిలో భవానీపేట్, చిల్లర్గి పరిధిలో పిట్లం, బోర్లం పరిధిలో హన్మాజీపేట్, మాచారెడ్డి పరిధిలో పాల్వంచ, అడ్లూర్ ఎల్లారెడ్డి పరిధిలో రామారెడ్డి పేర్లు ఉన్నాయి.
చట్టబద్ధ ప్రక్రియ తర్వాతే తుది నిర్ణయం
కొత్త సంఘాల ఏర్పాటు, ఇప్పటికే ఉన్న సంఘాల పునర్వ్యవస్థీకరణకు సంబంధించి నిర్దేశిత చట్టబద్ధమైన విధివిధానాలను పూర్తిచేసిన తర్వాతే సంబంధిత అధికారి తుది ఉత్తర్వులు జారీ చేయనున్నారు. సహకార సంఘాలకు కార్యవర్గాలను నామినేట్ చేస్తున్న తరుణంలో ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో కొత్త సహకార సంఘాలు ఏర్పాటు కానున్న ప్రాంతాల్లోని రైతుల్లో ఆసక్తి నెలకొంది.


