ఆర్మూర్‌టౌన్: ఆర్టీసీ ఆర్మూర్ డిపో కార్తీక మాసం ప్రత్యేకంగా భక్తులకు తీర్థయాత్రల అవకాశం కల్పిస్తోంది. భక్తులను దేవాలయ ప్రాంతాలకు నేరుగా చేర్చడంతో వారు సులువుగా దైవ దర్శనం చేసుకుంటున్నారు. ప్రైవేట్ వాహనాల్లో ఎక్కువ మొత్తం చెల్లించి వెళ్లేవారికి ఆర్టీసీ సేవలు తక్కువ ధరలో అందించడంతో భక్తులు ఆర్టీసీలో ప్రయణించడంపై మొగ్గు చూపుతున్నారు. తుల్జాపూర్ భవానీ, గంగాపూర్ దత్తాత్రేయ, బీదర్ నరసింహ స్వామి ఆలయాల యాత్ర ఏర్పాటు చేశారు. అలాగే అయ్యప్ప స్వామి భక్తులకు శబరిమల యాత్రకు ప్రత్యేక సూపర్ లగ్జరీ బస్సులను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ నెల 22 నుంచి 25వ తేదీ వరకు అరుణాచలం గిరి ప్రదక్షిణ యాత్రకు బస్సు బయలు దేరనుంది. ఈ యాత్రలో కాణిపాకం, వెల్లూరు గోల్డెన్ టెంపుల్, అరుణాచలం, అలంపూర్ జోగులాంబ దర్శణానికి ప్రత్యేక బస్సును ఏర్పాటు చేస్తున్నారు. ఒక్కొక్కరికి రూ. 5,100 టికెట్ ధర నిర్ణయించారు. భక్తులు డిపో అధికారులను సంప్రదించి సీట్లు బుక్ చేసుకోవాలని డిపో అధికారులు కోరుతున్నారు.
ఆర్టీసీ బస్సుల్లోనే ప్రయణం సురక్షితం
ఆర్మూర్ ఆర్టీసీ డిపో నుంచి తీర్థయాత్రలకు ప్రత్యేక బస్సులను భక్తుల కోసం ఏర్పాట్లు చేస్తున్నాం. ఆర్టీసీ బస్సుల్లోనే ప్రయణం క్షేమంగా.. సురక్షితంగా ఉంటుంది. భక్తులు, ప్రజలు ఆర్టీసీ సేవలను వినియోగించుకోవాలి.
– ప్రతిమరెడ్డి, మేనేజర్, ఆర్మూర్ ఆర్టీసీ డిపో


