● బీఆర్‌ఎస్ నేతల డిమాండ్
రుద్రూర్ : రబీ పంటల సాగు కోసం నిజాంసాగర్ ప్రాజెక్టు నుంచి సాగునీటిని విడుదల చేయాలని, వ్యవసాయానికి రోజుకు 9 గంటల పాటు విద్యుత్ సరఫరా చేయాలని ఎంపీటీసీల సంఘం రాష్ట్ర మాజీ కన్వీనర్, బాన్సువాడ నియోజక వర్గ నాయకుడు యలమంచిలి శ్రీనివాస్‌రావ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రుద్రూర్ మండల కేంద్రంలో ఆదివారం బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో ఆయన మాట్లాడారు. బాన్సువాడ నియోజకవర్గ పరిధిలోని భూములు వరి సాగుకు మాత్రమే అనుకూలంగా ఉన్నాయని, ఇతర పంటలు పండే పరిస్థితి లేదని పేర్కొన్నారు. ఈ ప్రాంతంలో పంటలు పూర్తిస్థాయిలో పండితే రైతులకు సుమారు రూ.వెయ్యి కోట్ల ఆదాయం సమకూరుతుందని చెప్పారు. ప్రస్తుతం నిజాంసాగర్ ప్రాజెక్టులో 9 టీఎంసీల నీరు అందుబాటులో ఉందని, గతంలో 6 టీఎంసీల నీరు ఉన్నప్పుడు కూడా సాగునీటిని విడుదల చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. సాగునీటితో పాటు రైతులకు 9 గంటల పాటు విద్యుత్ సరఫరా చేయాలని కోరారు.
ఈ ప్రాంతంలో మిగిలి ఉన్న వరి ధాన్యాన్ని ప్రభుత్వం తక్షణమే క్వింటాలుకు రూ.3,700 చొప్పున చెల్లించి కొనుగోలు చేయాలని శ్రీనివాస్‌రావు డిమాండ్ చేశారు. రైతుల సమస్యలను ప్రభుత్వం పట్టించుకోకపోతే బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. బీఆర్‌ఎస్ నాయకులు కొత్తపల్లి రవికిరణ్, డౌర్ సాయిలు, తెల్ల రవికుమార్, పాతవర్ని గంగప్ప, మోరె కిషన్, సూదం నవీన్, పార్వతి ప్రవీణ్, సురేష్ పటేల్, సిరిగాద శేఖర్, వంజరి సుమన్, తదితరులు పాల్గొన్నారు.


