పరీక్ష చేయించుకున్న 90 శాతం మందికి..
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : శారీరక శ్రమ లేని జీ వనశైలి, ఉరుకులు పరుగుల ఒత్తిడితో కూడిన జీవనం, శ్రమతో సంబంధం లేకుండా ఆహారపు అలవాట్లు వెరసి బీపీ, షుగర్ వంటి అసంక్రమిత వ్యా ధులు ఇంటింటా విస్తరిస్తున్నాయి. జిల్లాలో బీపీ, షుగర్ బాధితుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. వయస్సుతో సంబంధం లేకుండా 30 ఏళ్ల వయస్సు నుంచే బీపీ పెరగడం, రక్తంలో షుగర్ లెవల్స్ శ్రు తిమించడం చోటుచేసుకుంటున్నాయి. జిల్లావ్యా ప్తంగా బీపీ పరీక్షలు నిర్వహించిన 92,347 మంది లో ఏకంగా 89,072 మందికి బీపీ ఉన్నట్టు తేలింది. అలాగే 41,819 మంది షుగర్ పరీక్షలు నిర్వహిస్తే వారిలో 41,294 మంది షుగర్ బాధితులు ఉన్నా రు. పట్టణం, పల్లె తేడా లేకుండా దాదాపుగా ఇంటికొకరు అన్నట్టుగా బీపీ, షుగర్ బాధితులు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది.
శారీరక శ్రమ లేకుండా కూర్చుని పని చేసే వారిలో బీపీ, షుగర్ బాధితులు ఎక్కువగా పెరుగుతున్నారు. ఈ మధ్యకాలంలో 30 ఏళ్ల వయస్సు నుంచే బీపీ, షుగర్, అధిక కొవ్వు సమస్యలు ఎదురవుతున్నాయి. ఒకప్పుడు 50 ఏళ్లు దాటిన తర్వాత బీపీ, షుగర్ సమస్యలు వచ్చేవి. ఇప్పుడు వయస్సుతో సంబంధం లేకుండా 40 ఏళ్లలోపు వారే ఎక్కువగా ఈ వ్యాధులు బారిన పడుతున్నారు. మారుతున్న జీవనశైలి, వృత్తి, ఉద్యోగ జీవితాల్లో మానసిక ఒత్తిడులు, శారీరక శ్రమ లేకపోవడం, వ్యాయామానికి కనీస సమయం కేటాయించకపోవడం, జంక్ ఫుడ్, క్రమశిక్షణ లేని ఆహారపు అలవాట్లు తదితర కారణాలుగా చెబుతున్నారు.
గత ఐదేళ్ల కాలంలో బీపీ, షుగర్ బారిన పడుతున్న యువత సంఖ్య సైతం ఎక్కువగా ఉంటోంది. మొత్తం బాధితుల్లో సుమారు 30 శాతం వరకు 45 ఏళ్లలోపు వారు కూడా ఉంటుండటం పరిస్థితికి అద్దం పడుతోంది. చిన్న వయస్సులోనే విటమిన్ల అసమతుల్యత, అధిక కొవ్వు, ట్రైగ్లిజరైడ్స్ పెరగడం వంటి సమస్యలు ఎదురవుతున్నాయి. పట్టణ ప్రాంతాలతోపాటు గ్రామాల్లోనూ బీపీ, షుగర్ బాధితులు పెరుగుతున్నారు. దీర్ఘకాలిక వ్యాధుల నివారణ ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవాటు చేసుకోవడమే ముఖ్యమని వైద్యులు చెబుతున్నారు. రోజూ క్రమం తప్పకుండా వ్యాయామం, నడక అలవాటు చేసుకోవడం, శారీరక శ్రమ లేనివారు కార్బోహైడ్రేట్ అధికంగా ఉన్న ఆహారాలను తగ్గించుకోవాలని సూచిస్తున్నారు. కేవలం ముందస్తుగా రక్త పరీక్షలు చేయించుకోవడం ద్వారా ఈ వ్యాధుల ముప్పును ముందే తెలుసుకుని అప్రమత్తం కావొచ్చని చెబుతున్నారు.
ప్రతి ఒక్కరూ ఆరోగ్యంపై దృష్టిసారించి జీవనశై లిలో మార్పులు చేసుకోవాలి. 30 ఏళ్ల నుంచే ఆహా రంపట్ల జాగ్రత్తలు పాటించాలి. చాలామందికి శారీరక శ్రమ ఉండటం లేదు. ఇందుకోసం రోజూ తప్పనిసరి వ్యాయామం అలవాటు చేసుకోవాలి. ముందస్తుగా పరీక్షలు చేయించుకుని వ్యాధులు నిర్ధారణ అయితే క్రమంతప్పకుండా మందులు వాడాలి.
– డాక్టర్ రాజశ్రీ, డీఎంహెచ్‌వో, నిజామాబాద్
ప్రభుత్వం చేపడుతున్న ఎన్‌సీడీ (నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్) సర్వేలో భాగంగా పరీక్షలు నిర్వహించిన వారిలో దాదాపు 90 శాతం మందికి పైగా బీపీ లేదా షుగర్ సమస్యలు బయటపడుతున్నాయి. జిల్లాలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి, ఏరియా, కమ్యూనిటీ, పీహెచ్‌సీ కేంద్రాల్లో నిర్వహిస్తున్న పరీక్షల్లో రక్త పరీక్షలు చేస్తుండగా ఇందులో బీపీ, షుగర్ బాధితులే ఎక్కువగా కనిపిస్తున్నారు. ప్రైవేటుగా పరీక్షలు చేయించుకుని చికిత్స పొందుతున్న వారు ఇంకా చాలామంది ఉంటున్నారు. ఎన్‌సీడీ సర్వేలో భాగంగా జిల్లాలో మొత్తం 92,347 మంది పరీక్షలు చేయగా ఇందులో 89,072 మంది బాధితులు ఉన్నారు. మొత్తం 41,819 మందికి షుగర్ పరీక్షలు చేయగా ఇందులో 41,294 మందికి నిర్ధారణ అయ్యింది. అలాగే నోటి కేన్సర్, రొమ్ము కేన్సర్, గర్భాశయ కేన్సర్ పరీక్షలు నిర్వహించి బాధితులను గుర్తిస్తున్నారు. ఇప్పటివరకు 60 మంది రొమ్ము కేన్సర్ బాధితులను గుర్తించగా ఇందులో 46 మందిని చికిత్స కోసం హైదరాబాద్‌కు రిఫర్ చేశారు. 84 మందికి నోటి కేన్సర్‌గా నిర్ధారణ కాగా 47 మందిని హైదరాబాద్ రిఫర్ చేశారు. 21 మందికి గర్భాశయ కేన్సర్ ఉన్నట్టు తేలగా సమస్య తీవ్రత అధికంగా ఉన్న 17 మందిని హైదరాబాద్ రిఫర్ చేశారు.
పట్టణం, పల్లె తేడా లేకుండా ఇంటింటా రక్తపోటు, మధుమేహ బాధితులు
30 ఏళ్లకే బీపీ, షుగర్
మారిన జీవనశైలి..
భారీగా పెరుగుతున్న
అసంక్రమిత వ్యాధులు
జిల్లాలో 89,072 మంది బీపీ,
41,294 మంది షుగర్ బాధితులు


