కామారెడ్డి టౌన్: ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పని పట్టణ సీఐ నరహరి హెచ్చ రించారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని పోలీస్ స్టేషన్ ముందు ట్రాఫిక్ ఎస్సై చంద్రశేఖర్, సిబ్బందితో వాహనాల తనిఖీ చేపట్టారు. నంబర్ ప్లేట్లు లేకుండా తిరుగుతున్న వాహనాలను నిలిపివేసి జరిమానా విధించడంతో పాటు అక్కడికక్కడే నంబర్ ప్లేట్లు బిగించారు. అలాగే పట్టుబడిన వాహనాలపై ఉన్న పెండింగ్ చలాన్లను ఆన్‌లైన్‌లో తనిఖీ చేసి, వాహనదారుల చేత కట్టించారు. సీఐ మాట్లాడుతూ.. మరోసారి నంబర్ ప్లేట్లు లేకుండా పట్టుబడి తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. తల్లిదండ్రులు మైనర్లకు ఎట్టి పరిస్థితుల్లోనూ వాహనాలు ఇవ్వకూడదని అన్నారు. పట్టణంలో ఈ తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని, వాహనదారులు నిబంధనలు పాటించి సహకరించాలని కోరారు.


