నందిపేట్: మండల కేంద్రంలోని పలు హోటళ్లు, ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లపై ఆహార భద్రత(ఫుడ్ సేఫ్టీ) అధికారులు శుక్రవారం దాడులు నిర్వహించారు. దాడులలో పలు హోటల్లో అపరిశుభ్ర వాతావరణంలో నిలువ ఉంచిన మాంసంతో పాటు ఫుడ్ కలర్ వినియోగించిన మాంసాన్ని గుర్తించారు. నిబంధనలకు విరుద్ధంగా ఉన్న ఆహార పదార్థాలను స్వాధీనం చేసుకుని ధ్వంసం చేశారు. ఫుడ్ సేఫ్టీ లైసెన్సులు లేని 6 సెంటర్లకు నోటీసులు జారీ చేశారు. లోపాలు సరిచేసే వరకు వ్యాపారాన్ని మూసివేయాలని ఆదేశించారు. జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారిణి ఎన్ నవిత మాట్లాడుతూ.. హోటల్ యజమానులు ప్రజల ఆరోగ్యంతో చెలగాటమడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. టెస్టింగ్ సాల్ట్, ఫుడ్ కలర్, సింథటిక్ రంగులు వంటివి వాడకూడదని, నిబంధనలను తప్పనిసరిగా పాటించాలన్నారు. ప్రజలకు నాణ్యమైన ఆహారాన్ని అందించాల్సిన బాధ్యత వ్యాపారులపై ఉందన్నారు. గడువు ముగిసిన వస్తువులు, కల్తీ పదార్థాలు, అపరిశుభ్రంగా ఉన్న పదార్థాలు గుర్తిస్తే ఫిర్యాదు చేయాలన్నారు.
రేషన్ బియ్యం పట్టివేత
మాక్లూర్: మండలంలోని మాదాపూర్ గ్రామంలో అక్రమంగా నిల్వ ఉంచిన 28.30 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు శుక్రవారం పట్టుకున్నారు. గ్రామంలోని రేషన్ షాపుపై అధికారులు దాడులు నిర్వహించి బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. పట్టుకున్న బియ్యాన్ని మండల ఉప తహసీల్దార్‌కు అప్పగించినట్లు అధికారులు తెలిపారు. రేషన్ డీలర్‌పై కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్నట్లు వెల్లడించారు.
డ్రంక్ అండ్ డ్రైవ్‌లో
ఒకరికి జైలు
రేణిగుంట: మద్యం సేవించి వాహనం నడిపిన వ్యక్తికి తిరుపతిలోని స్పెషల్ జుడీషియల్ సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టు 10 రోజుల సాధారణ జైలు శిక్షతో పాటు రూ.10 వేల జరిమానా విధించినట్లు రేణిగుంట సీఐ జయచంద్ర శుక్రవారం తెలిపారు. కామారెడ్డి జిల్లా పిట్లం మండలం తిమ్మానగర్‌కు చెందిన లారీ డ్రైవర్ వెంకటరెడ్డి (65) మద్యం సేవించి లారీ నడపడంతో పట్టణ పోలీస్ స్టేషన్‌లో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు నమోదు చేశారు. నిందితుడు నేరాన్ని అంగీకరించడంతో న్యాయస్థానం శుక్రవారం తీర్పు వెలువరించింది.


