డొంకేశ్వర్(ఆర్మూర్): జిల్లా వ్యాప్తంగా తాగునీటి ఎద్దటిని నివారించడంతోపాటు భూగర్భ జలాల వృథాను అరికట్టేందుకు జిల్లా యంత్రాంగం నడుం బిగించింది. జిల్లాలో నీరు ఎక్కువగా వృథా అవుతున్న గ్రామ పంచాయతీలను గుర్తించి మినీ వాటర్ ట్యాంకులను ఏర్పాటు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఇందుకోసం 1,128 మినీ ట్యాంకులను మంజూరు చేస్తూ.. కొనుగోలు కోసం జీపీ నిధులను వినియోగించాలని సూచించారు. ఇప్పటికే బోధన్ డివిజన్‌లో పనులు ఊపందుకున్నాయి. అదే విధంగా పంచాయతీల పరిధిలోని సింగిల్, త్రీ ఫేజ్ మోటార్ల పనితీరుపై కార్యదర్శులు, సర్పంచులు కలిసి ప్రత్యేక సర్వే చేపడుతున్నారు. మోటార్లు ఆన్ చేసి... అవి నిరంతరాయంగా ఎన్ని గంటలు నీరు పోస్తున్నాయి? ఎంత సమయానికి బోర్లలో నీటి మట్టం తగ్గుతోంది? అనే అంశాలపై క్షేత్రస్థాయిలో భూగర్భ జలాలను అంచనా వేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 3,657 సింగిల్ ఫేజ్, 1,771 త్రీ ఫేజ్ మోటార్లను పరీక్షిస్తున్నారు. నీరు అందని బోర్లకు ఫషింగ్, డీపెనింగ్ పనులు చేపట్టాలని సర్పంచులు, జీపీ కార్యదర్శులు నివేదికలు ఇస్తున్నారు. ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా అవసరమున్న వార్డుల వివరాలను సైతం సేకరిస్తున్నారు. జిల్లాలోని 545 గ్రామ పంచాయతీల నుంచి వచ్చిన సమాచారం మేరకు జిల్లా పంచాయతీ అధికారులు సమగ్ర ‘యాక్షన్ ప్లాన్’ కోసం కసరత్తు చేస్తున్నారు.
బోర్ల వినియోగంపై ఆంక్షలు!
గ్రామ పంచాయతీల పరిధిలోని బోరు మోటార్లను ఇష్టానుసారంగా వాడకుండా వాటి వినియోగాన్ని గణనీయంగా తగ్గించాలని అధికారులు స్పష్టమైన ఆదేశాలిచ్చారు. ప్రజల అవసరం మేరకు మాత్రమే వినియోగించాలని, ముఖ్యంగా ఉదయం, సాయంత్రం వేళల్లో ఎక్కువ సేపు ఆన్ చేసి ఉంచొద్దని నిబంధనలు పెట్టారు. దీంతో ఉదయం 10 గంటల్లోగానే తాగునీటి సరఫరాను పూర్తిగా నిలిపివేస్తున్నారు. ఇక సాయంత్రం పూట కేవలం ఒక గంట మాత్రమే నీటి సరఫరా చేస్తూ భూగర్భ జలాలు వృథా కాకుండా చర్యలు తీసుకుంటున్నారు.
నీటి పొదుపు అందరి బాధ్యత
జిల్లాలోని గ్రామ పంచాయతీల్లో తాగునీటి ఎద్దటి రాకుండా చూడడంతోపాటు భూగర్భ జలాలను కాపాడుకోవడం అందరి బాధ్యత. నీటి వృథాను అరికట్టేందుకు కలెక్టర్ ఆదేశాల మేరకు 1,128 మినీ ట్యాంకులను జీపీ నిధులతో ఏర్పాటు చేస్తున్నాం. బోర్ల స్థితిగతులు, మోటార్ల పనితీరుపై పూర్తిగా డేటాను సేకరిస్తున్నాం. దీని ఆధారంగా సమగ్ర యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తాం. – నాగరాజు, ఇన్‌చార్జి డీపీవో
జిల్లా వ్యాప్తంగా 1,128 ఏర్పాటుకు
కలెక్టర్ ఆదేశాలు
బోర్ల వద్ద మోటార్ల పనితీరు,
భూగర్భ జలాల అంచనా కోసం సర్వే
పంచాయతీల నివేదికలతో
సమగ్ర కార్యాచరణ


