● పేదరికాన్ని తట్టుకొని రాణిస్తున్న విద్యార్థిని
● జాతీయ స్థాయిలో పతకాల సాధన
మాక్లూర్: చదువుతోపాటు సాఫ్ట్‌బాల్ క్రీడలో రాణిస్తూ విజయపథంలో దూసుకెళ్తుందీ క్రీడాకారిణి. జిల్లా, రాష్ట్రస్థాయి పోటీలల్లో పాల్గొని తన క్రీడానైపుణ్యం, ప్రతిభతో జాతీయ స్థాయి పోటీలలో పాల్గొని పతకాలు, ప్రశంసలు అందుకుంటోంది. మాక్లూర్ మండలం ఒడ్యాట్‌పల్లి గ్రామానికి చెందిన గంగాధర్, సవిత దంపతుల కూతురు కీర్తన డిచ్‌పల్లి మండలం సుద్దపల్లి సాంఘిక సంక్షేమ హాస్టల్‌లో ప్రస్తుతం ఇంటర్మీడియట్ చదువుతోంది. ఐదో తరగతిలో చేరిన కీర్తన సాఫ్ట్‌బాల్ క్రీడపై మక్కువ పెంచుకుంది. కీర్తనకు ఉన్న ఆసక్తిని గమనించిన కోచ్ మౌనిక స్పోర్ట్స్ అకాడమీలో ప్రత్యేక శిక్షణ ఇప్పించారు. దీంతో బాలికల జూనియర్ విభాగం మండల స్థాయి నుంచి జాతీయ స్థాయి క్రీడాకారిణిగా ఎదిగింది. జిల్లా, రాష్ట్రస్థాయిలో పలు ప్రత్యేక గోల్డ్ మెడల్స్ సాధించింది. గత సంవత్సరం తైవాన్ దేశలో జరిగిన బాలికల జూనియర్ విభాగం సాఫ్ట్‌బాల్ టోర్నీలో పాల్గొని కప్ సాధించింది. ఈ నెల 2న నిర్మల్‌లో జరిగిన రాష్ట్రస్థాయి టోర్నీలో జిల్లా జట్టును విజయ తీరాలకు చేర్చడంలో కీర్తన కీలకపాత్ర పోషించింది. ఒంటి చేత్తో జట్టును విజయం వైపు నడిపించి కప్‌లు దక్కెలా చేసి క్రీడాభిమానుల ప్రశంసలు అందుకుంది. కూతురు కీర్తన సాఫ్ట్‌బాల్ క్రీడలో ఎదుగుతున్న తీరును చూసి తల్లిదండ్రులు మురిసిపోతున్నారు. కానీ రాష్ట్ర, జాతీయ స్థాయిలో క్రీడా పోటీల్లో పాల్గొనేందుకు ఆమె ఖర్చులకు అప్పులు చేయాల్సి వస్తుంది. తండ్రి మున్సిపల్ కార్మికుడు, తల్లి గృహిణి కాగా, కీర్తన ఖర్చు భారమవుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎవరైనా ఉదార స్వభావులు ఆర్థిక సహాయం అందించి కీర్తనను ప్రోత్సహించాలని వేడుకుంటున్నారు.


