సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: గ్రామాల్లో అభివృద్ధి పేరిట ఏర్పాటై సమాంతర వ్యవస్థలను నడిపిస్తున్న వీడీసీలు కొన్నిచోట్ల మితిమీరి వ్యవహరిస్తున్నాయి. మాట వినని వారిని, చెప్పినట్టు నడుచుకోని వారిని సామాజికంగా వెలివేస్తూ గ్రామాల్లో పెత్తనం సాగి స్తున్నాయి. చాలా సందర్భాల్లో బాధితులు ఫిర్యాదు చేసేందుకు సైతం ముందుకు రావడం లేదు. జిల్లాలో సామాజిక బహిష్కరణ విధించిన ఐదుగురు వీడీసీ సభ్యులకు ఇటీవల ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కోర్టు ఐదేళ్ల జైలు శిక్ష విధించింది. పోలీసుల కేసులు, కోర్టు తీర్పుల నేపథ్యంలో ఇప్పటికై నా సామాజిక బహిష్కరణల ఆగడాలకు అడ్డుకట్ట పడాలన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
బీసీ కమిషన్ ప్రత్యేక చొరవ..
గ్రామాల్లో స్వయం సమృద్ధి, అభివృద్ధి కోసం ఏర్పాటైన కమిటీలు క్రమంగా పెత్తనం చెలాయిస్తూ కొన్నివర్గాలను ఇబ్బందులు పెడుతున్న వైనంపై రాష్ట్ర బీసీ కమిషన్‌కు ఫిర్యాదులు అందాయి. దీంతో తీవ్రంగా స్పందించిన బీసీ కమిషన్ అక్టోబర్ 6న జిల్లాలో పర్యటించింది. రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్, ఇతర సభ్యులు కలెక్టరేట్‌లో అధికార యంత్రాంగంతో కలిసి సమీక్షించారు. జిల్లాలో ప్ర జాప్రతినిధులు, అధికారుల కన్నా వీడీసీ సభ్యులే సుప్రీంగా మారారని కమిషన్ చైర్మన్ వ్యాఖ్యానించారు. జిల్లావ్యాప్తంగా 23 గ్రామాలకు సంబంధించి మొత్తం 90 దరఖాస్తులు కమిషన్‌కు అందాయి. జిల్లాలో సామాజిక బహిష్కరణ ఘటనలు చోటుచేసుకోకుండా అదనపు కలెక్టర్ స్థాయిలో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని కమిషన్ ఆదేశించింది. బాధితులకు సహాయంగా కలెక్టరేట్‌లో ఉచిత లీగల్ ఎయిడ్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని అధికారులను నిర్దేశించింది. బీసీ కమిషన్ సిఫారసు మేరకు జిల్లాలో ప్రత్యేక కమిటీ, పర్యవేక్షణ ఏర్పాటు చేస్తేనే సామాజిక బహిష్కరణల రుగ్మతలకు అడ్డుకట్ట పడే అవకాశం ఉంది.
సామాజిక బహిష్కరణలతో వివాదాస్పదంగా గ్రామాభివృద్ధి కమిటీల తీరు
కేసులు పెడుతున్నా తగ్గని వైనం
జైలు పాలైన దూస్‌గాం వీడీసీ సభ్యులు
ఐదేళ్ల శిక్ష విధించిన స్పెషల్ కోర్టు
డిచ్‌పల్లి మండలం దూస్‌గాం గ్రామంలో 2021లో వీడీసీ నూతన కమిటీ ఏర్పాటైంది. ఈ కమిటీలో క్యాషియర్ పదవి ఎప్పుడూ తమ వర్గానికి ఇవ్వలేదని కొందరు ప్రశ్నించారు. తమను ప్రశ్నించారన్న కారణంతో వీడీసీ సభ్యులు వారి కుటుంబాలను సామాజికంగా బహిష్కరించారు. బాధితులు పోలీసులను ఆశ్రయించగా, ఐదేళ్లుగా ఎస్సీ, ఎస్టీ కోర్టులో విచారణ కొనసాగింది. ఈ నెల 4న వీడీసీ సభ్యులు ఐదుగురికి ఐదేళ్లపాటు జైలు శిక్ష, ఒక్కొక్కరికి రూ. 10 వేల చొప్పున జరిమానా విధిస్తూ కోర్టు తీర్పునిచ్చింది. గతంలో జక్రాన్‌పల్లి మండలకేంద్రంతోపాటు కొలిప్యాక్ గ్రామంలో ఓ కుటుంబంపై సామాజిక బహిష్కరణ వేటు వేయడంతో వీడీసీ సభ్యులపై కేసు నమోదైంది. ఇదే మండలంలోని మునిపల్లిలో తమను బహిష్కరించారంటూ ఓ కులానికి చెందిన వ్యక్తులు ఫిర్యాదు చేయడంతో వీడీసీ సభ్యులు 13 మందిపై కేసు నమోదు చేసి జైలుకు పంపారు.


