పౌష్టికాహారానికి కోత | - | Sakshi
Sakshi News home page

పౌష్టికాహారానికి కోత

Nov 7 2026 1:18 AM | Updated on Nov 7 2026 1:18 AM

ఆర్మూర్‌: ప్రభుత్వ వసతి గృహాల్లోని విద్యార్థులకు పౌష్టికాహారం అందడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన విధానంతో భోజన మెనూలో కోత పడిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. గతేడాది వరకు జిల్లా కలెక్టర్‌ ఆధ్వర్యంలోని జిల్లా పర్చేస్‌ కమిటీ(డీపీసీ) ద్వారా నాణ్యమైన సరుకులు తక్కువ ధరకు కొనుగోలు చేసి మెనూ అమలు చేశారు. అయితే ఈ ఏడాది రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సెంట్రల్‌ పర్చేస్‌ విధానం (సీపీసీ)తో ఇబ్బందులు ఎదురవుతున్నట్లు తెలుస్తోంది.

7,896 మంది విద్యార్థులు

జిల్లా వ్యాప్తంగా షెడ్యూల్‌ కులాలు, గిరిజన సంక్షేమ, వెనకబడిన తరగుతుల శాఖల పరిధిలో పోస్టుమెట్రిక్‌, ప్రీమెట్రిక్‌ వసతి గృహాలు మొత్తం 84 ఉన్నాయి. వీటిలో సుమారు 7,896 మంది విద్యార్థులు ఉంటున్నారు. గతేడాది జిల్లా పర్చేస్‌ కమిటీ వారానికి ఐదు గుడ్లు, ఐదు అరటి పండ్లు, రెండుసార్లు చికెన్‌, ఉదయం వివిధ రకాల టిఫిన్లతో పౌష్టికాహారం అందించేది. నూతనంగా అమలు చేస్తున్న సీపీసీ విధానంలో రాష్ట్రవ్యాప్తంగా సరుకుల సరఫరా కోసం ఎన్‌ఏసీవోఎఫ్‌ (నాకాఫ్‌) అనే సంస్థకు టెండర్‌ అప్పగించారు. ఈ సంస్థ సాధారణ సరుకులకే 40 నుంచి 50 శాతం అధిక ధరలను కోట్‌ చేస్తూ నాసిరకం వస్తువులను సప్లయ్‌ చేస్తోందని వసతిగృహాల సిబ్బంది ఆరోపిస్తున్నారు. దీంతో ప్రస్తుతం వారానికి కేవలం రెండు గుడ్లు, రెండు అరటిపండ్లు, ఒక్కసారి మాత్రమే చికెన్‌కు పడిపోయింది. నాసిరకం సరుకులతో తయారు చేసిన భోజనం తినడంతో విద్యార్థుల ఆరోగ్యంపై ప్రభావం పడుతుందని హాస్టల్‌ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పాత విధానాన్ని అమలు చేసి విద్యార్థులకు నాణ్యమైన, పౌష్టికాహారాన్ని అందించాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.

సెంట్రల్‌ పర్చేస్‌ విధానంతో

హాస్టళ్లకు నాణ్యత లేని సరుకులు

పాత విధానంలో సరుకులు రవాణా చేయాలంటున్న నిర్వాహకులు

జిల్లాలో 84 సంక్షేమ వసతి గృహాలు

కడుపు కొడుతున్నారు

హాస్టళ్లలో ఉన్నది పేద విద్యా ర్థులే. గతేడాది కిలో కంది పప్పు ధర మార్కెట్‌ రూ.90 ఉంటే నకాఫ్‌ వాళ్లు రూ.140 కి బిల్లు పెడుతున్నారు. 50 శాతం అధిక ధరకు నాసిరకం సరుకులు సప్లయ్‌ చేస్తే మెనూ ఎలా నడుస్తుంది..? ఇది విద్యార్థుల కడుపు కొట్టడమే. నకాఫ్‌ టెండర్‌ రద్దు చేసి, డీపీసీ విధానాన్ని కొనసాగించాలి.

– డీ.నిఖిల్‌, పీడీఎస్‌యూ, ఆర్మూర్‌ అధ్యక్షుడు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement