● ప్రభుత్వ బడుల్లో ఇటీవల 1–10
తరగతులకు ఎస్‌ఏ–1 పరీక్షల నిర్వహణ
● మార్కులను విద్యార్థుల తల్లిదండ్రుల స్మార్ట్‌ఫోన్లకు పంపిన విద్యాశాఖ
ఖలీల్‌వాడి: ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి ఇప్పటికే ప్రభుత్వం అనేక కార్యక్రమాలను చేపడుతోంది. అందులోభాగంగా పాఠశాలలో విద్యార్థులు డిజిటల్ క్లాసులు బోధిస్తున్నారు. పరీక్షలను నిర్వహించి, ప్రశ్నాపత్రాల మూల్యాంకనం మండలస్థాయిలో చేపడుతున్నారు. ఇటీవల పాఠశాల విద్యాశాఖ 1నుంచి 10వ తరగతి విద్యార్థులకు ఎస్‌ఏ–1 పరీక్షలు నిర్వహించగా, తాజాగా విద్యార్థులు సాధించిన మార్కులను తల్లిదండ్రుల స్మార్ట్‌ఫోన్లకు వాట్సాప్ వేదికగా పంపించారు.
గతంలో విద్యార్థులకు యూనిట్ టెస్ట్‌లు, ఆఫ్ ఇయర్లీ, వార్షిక పరీక్షలకు సంబంధించిన ప్రొగ్రెస్ కార్డును విద్యార్థులకు ఇచ్చేవారు. గత ఏడాది పూర్తయిన తర్వాత నాలుగు ఎఫ్‌ఏలు, రెండు ఎస్‌ఏలతో పాటు గ్రేడింగ్, హాజరు, ఫలితాలు తదితర వివరాలతో కూడా జాబితాను విద్యాసంవత్సరం అఖరి రోజున ఆన్‌లైన్‌లో ఉన్న జాబితాను డౌన్‌లోడ్ చేసి విద్యార్థులకు ప్రింట్ తీసి ఇచ్చేవారు. ప్రస్తుతం ఫోన్‌కే విద్యార్థుల ప్రగతి నివేదిక పంపించడంతో తల్లిదండ్రులకు సులువుగా వారి సామర్థ్యం తెలుసుకునే అవకాశం కలిగింది.
జిల్లాలో లక్షకు పైగా విద్యార్థులు..
ఇటీవల విద్యార్థులకు పరీక్షలు నిర్వహించిన తర్వాత పేపర్లను మండల విద్యాశాఖలో వేరే పాఠశాలకు చెందిన టీచర్లతో జవాబు పత్రాలను మూల్యాంకనం చేయించారు. మార్కులను ఆన్ లైన్‌లో నమోదు చేయగా, మార్కుల జాబితా జారీలో నూతన విధానం తీసుకువచ్చారు. విద్యార్థుల తల్లిదండ్రుల స్మార్ట్ ఫోన్లకు నేరుగా మార్కుల జాబితాను గురువారం పంపించారు. ప్రస్తుత విద్యాసంవత్సరంలో నిర్వహించిన నిర్మాణాత్మక మూల్యాంకనం(ఎస్‌ఏ–1, ఎఫ్‌ఏ–2), సంగ్రహణా త్మక మూల్యాంకనం(ఎస్‌ఏ–1) పరీక్షల్లో పిల్లలకు వచ్చిన మార్కుల వివరాలతో పాటు నెలవారీగా పాఠశాల పనిచేసిన దినాలు, విద్యార్థి హాజరు వివరాలు మార్కుల జాబితాలో ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా ఉన్న 1156 పాఠశాలలో సుమారు లక్ష మంది విద్యార్థుల తల్లిదండ్రులకు ఆన్‌లైన్‌లో స్మార్ట్‌ఫోన్లకు జాబితాలను పంపారు. ఈ మార్కుల జాబితాను తల్లిదండ్రులు డౌన్‌లోడ్ చేసుకుని తమ పిల్లలకు ఎన్ని మార్కులు వచ్చాయో తెలుసుకున్నారు. ఈ నూతన విధానంతో విద్యార్థుల తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.


