● సురక్షిత ప్రాంతాల్లోనే ప్రజలు
టపాసులను కాల్చాలి
● పిల్లలపై తల్లిదండ్రులు
పర్యవేక్షణ తప్పనిసరి ఉండాలి
ధర్పల్లి (నిజామాబాద్ రూరల్): వెలుగుల పండుగ దీపావళి అంటే చిన్నా,పెద్ద తేడా లేకుండా అందరికీ ఎంతో ఇష్టం. ఈ పర్వదినాన ప్రకాశవంతమైన దివ్వెల కాంతులతో, రంగురంగుల బాణాసంచాతో సంబురాలు అంబరాన్ని తాకుతాయి. అయితే ఈ సంతోషకరమైన పండుగ సమయంలో బాణాసంచా పేల్చడంలో చిన్నపాటి అజాగ్రత్త పెద్ద ప్రమాదాలకు దారితీసే అవకాశం ఉంది. ప్రతి సంవత్సరం బాణాసంచా కాల్చే సమయంలో అనేకమంది కంటి చూపు కోల్పోవడం, తీవ్రమైన కాలిన గాయాలపాలవ్వడం వంటి సంఘటనలు వెలుగుచూస్తున్నాయి. ఈ క్రమంలో పండుగవేళ టపాసులు కాల్చే సమయంలో జాగ్రత్తలు పాటించాలని వైద్యులు, అగ్నిమాపక శాఖ అధికారులు ప్రజలకు సూచిస్తున్నారు. చిన్నారులు టపాసులు కాల్చే సమయంలో తల్లిదండ్రులు దగ్గరుండి పర్యవేక్షించాలంటున్నారు.
● ఇళ్ల లోపల, మేడలపై లేదా ఇరుకై న ప్రదేశాలలో కాకుండా విశాలమైన బహిరంగ ప్రదేశాలలో మాత్రమే టపాసులు పేల్చాలి.
● కాటన్ దుస్తులు, ఒంటికి బిగుతుగా ఉండే వా టిని ధరించడం మంచిది. వదులుగా ఉండే నైలాన్ లేదా సింథటిక్ దుస్తులకు దూరంగా ఉండాలి.
● గ్యాస్ సిలిండర్లు, మంటలు త్వరగా వ్యాపించే పదార్థాలు లేదా గడ్డివాములు ఉన్న చోట బాణసంచా కాల్చకూడదు.
● ప్రమాదవశాత్తూ మంటలు చెలరేగితే వెంటనే ఆర్పివేయడానికి నీటితో నింపిన బకెట్లు, ఇసుక, ప్రథమ చికిత్స (ఫస్ట్ ఎయిడ్) కిట్‌ను అందుబాటులో ఉంచుకోవాలి.
● అంటించిన తర్వాత వెలగని టపాసులను పరిశీలించడానికి వెంటనే వాటి దగ్గరకు వెళ్లకూడదు.
● చేతిలో బాణసంచా పట్టుకుని పేల్చడం లేదా బాటిళ్లలో రాకెట్లు పెట్టి కాల్చడం వంటి విన్యాసాలు చేయవద్దు.
● వినికిడి లోపం, శ్వాసకోశ సమస్యలు వచ్చే అవకాశం ఉన్నందున పరిమితికి మించిన శబ్దం, పొగనిచ్చే టపాసులను నివారించాలి.
● గాయాలైనప్పుడు కాలిన భాగంపై వెంటనే చల్లని నీరు పోయాలి లేదా బర్నోల్ వంటి లేపనాలు రాయాలి.


