బోధన్ రూరల్: పట్టణంలోని మారుతి మందిరం, చక్రేశ్వర శివమందిరం హుండీలను శుక్రవారం దేవాదాయ శాఖ పరిశీలకురాలు సుజాతారెడ్డి పర్యవేక్షణలో తెరిచి ఆదాయాన్ని లెక్కించారు. మారుతి మందిరం హుండీల ద్వారా రూ.53,881 ఆదాయం రాగా, చక్రేశ్వర శివమందిరం హుండీల ద్వారా రూ.1,29,606 ఆదాయం సమకూరినట్లు వారు వివరించారు.
తెయూ(డిచ్‌పల్లి): తెలంగాణ యూనివర్సిటీ ఎన్‌ఎస్‌ఎస్ యూనిట్–1 ఆధ్వర్యంలో నిర్వహించిన ఎన్‌ఎస్‌ఎస్ టీ–7 క్రికెట్ ఛాంపియన్‌షిప్ టోర్నమెంట్ శుక్రవారం విజయవంతంగా ముగిసింది. ఈ పోటీల్లో ఐపీసీహెచ్ ఛాలెంజర్స్, ఐఎంబీఏ పవర్ హిట్టర్స్, ఏపీఈ వారియర్స్, ఇంజినీరింగ్ రాయల్స్ జట్లు పాల్గొన్నాయి. ఉత్కంఠభరితంగా సాగిన టోర్నమెంట్‌లో ఐపీసీహెచ్ ఛాలెంజర్స్ జట్టు విజేతగా నిలిచి ఛాంపియన్‌షిప్‌ను కై వసం చేసుకోగా, ఐఎంబీఏ పవర్ హిట్టర్స్ జట్టు రన్నరప్‌గా నిలిచింది. విజేతలకు నిర్వాహకులు బహుమతులు అందజేశారు. ఎన్‌ఎస్‌ఎస్ యూనిట్ –1 ప్రోగ్రాం ఆఫీసర్ సీహెచ్ శ్రీనివాస్, వాలంటీర్లు, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.
ధర్పల్లి: ధర్పల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కెరీర్ గైడెన్స్ సెల్, ప్లేస్మెంట్ సెల్ ఆధ్వర్యంలో మ్యాజిక్ బస్ సౌజన్యంతో ఈనెల 10న మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ జ్యోతి తెలిపారు. కళాశాలలో శుక్రవారం జాబ్‌మేళాకు సంబంధించిన గోడపత్రాలను ఆవిష్కరించారు. మేళాలో టాటా ఎలక్ట్రానిక్స్, ప్రీమియర్ ఎనర్జీస్, ఆపిల్, కియా, కార్పొరేషన్ లిమిటెడ్ వంటి ప్రముఖ బహుళజాతి కంపెనీలు పాల్గొని అభ్యర్థులను ఎంపిక చేయనున్నట్లు తెలిపారు. ఐటీఐ, డిప్లొమా, ఇంటర్, డిగ్రీ, బీటెక్ పూర్తి చేసినవారు, ప్రస్తుతం చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు అర్హులని పేర్కొన్నారు. విద్యార్థులు తమ సర్టిఫికెట్లతో నేరుగా ఇంటర్వ్యూకి హాజరుకావాలని సూచించారు. పూర్తి వివరాల కోసం 99595 19704 ఫోన్ నంబర్‌ను సంప్రదించాలన్నారు.
సిరికొండ: మండల కేంద్రంలోని భవిత కేంద్రంలో ఆయా పోస్టు భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఐఈఆర్‌పీ వరప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు. దివ్యాంగ పిల్లలను చూసు కోవడానికి 18 నుంచి 45 ఏళ్లలోపు వయసు గలవారు ఏడో తరగతి పాస్ అయి ఉండాలని తెలిపారు. నెలకు వేతనం రూ.3250 ఉంటుందన్నారు. ఆసక్తిగల అభ్యర్థులు ఈ నెల 9లోపు ఎంఈవో కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు.


