అటు వ్యథ
కంఠేశ్వర్ బైపాస్ రోడ్డులో మిషన్ భగీరథ పైపులైన్ నుంచి వృథాగా.. నీరు
నిజామాబాద్ అర్బన్/ఖలీల్‌వాడి: ఎల్‌నినో ప్రభావంతో తాగు, సాగునీరు, విద్యుత్ పొదుపుగా వాడుకోవాలని ప్రభుత్వం, అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రతి ఒక్కరికీ నీటిని పొదుపు చేయాల్సిన బాధ్యత ఉంది. మరోవైపు నీటి వృథాను అరికట్టాల్సిన అవసరమూ ఉంది. కానీ, నిజామాబాద్ నగరంలో పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. తాగునీటి పైపులైన్ల లీకేజీలతో కొన్ని కాలనీల్లో నీరు వృథా అవుతుంటే మరికొన్ని కాలనీల్లో నీటి సరఫరా లేక ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వ అధికారులు నీటి వృథాపై దృష్టి సారించడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నగరంలోని కంఠేశ్వర్ బైపాస్ చౌరస్తా నుంచి కలెక్టరేట్‌కు వెళ్లే దారిలో మిషన్ భగీరథకు చెందిన తాగునీటి పైపులైన్ పగిలి నీరు వృథాగా పోతోంది. శ్రీనగర్ కాలనీలోని ప్రెసిడెన్సీ స్కూల్ వద్ద వారం రోజులుగా పైప్‌లైన్ లీకేజీతో నీరు రోడ్డుపై ప్రవహిస్తోంది. ఈ విషయాన్ని మున్సిపల్ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా స్పందించడం లేదనే విమర్శలున్నాయి. నగరంలోని నాగారం 300 క్వార్టర్స్‌లో తీవ్ర తాగునీటి ఎద్దడి నెలకొంది. 20 రోజులుగా నీటి సరఫరా నిలిచిపోవడంతో కాలనీకి చెందిన మహిళలు శుక్రవారం రోడ్డుపై ఖాళీ బిందెలతో నిరసన తెలిపారు. ఇప్పటికై నా సంబంధిత అధికారులు పైప్‌లైన్ల లీకేజీలను అరికట్టి, నీటి సరఫరా మెరుగుపర్చాల్సిన అవసరం ఎంతైనా ఉంది.


