తెయూ(డిచ్‌పల్లి): తెలంగాణ యూనివర్సిటీ పరిధిలో కొనసాగుతున్న ఎంఈడీ 2వ సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షలు మంగళవారం ప్రశాంతంగా జరిగినట్లు అకడమిక్ ఆడిట్ సెల్ డైరెక్టర్ ప్రొఫెసర్ ఘంటా చంద్రశేఖర్ తెలిపారు. పరీక్షలకు 26 మంది విద్యార్థులకు గానూ 25 మంది హాజరుకాగా ఒకరు గైర్హాజరైనట్లు పేర్కొన్నారు. పరీక్ష కేంద్రాన్ని వర్సిటీ ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ జి.రాంబాబు తనిఖీ చేశారు.
తెయూ(డిచ్‌పల్లి): తెలంగాణ యూనివర్సిటీ రసాయన శాస్త్ర విభాగంలో పరిశోధక విద్యార్థి పోతు రాకేశ్ డాక్టరేట్ సాధించారు. ‘డిజైన్– సింథసిస్ అఫ్ నవెల్ తేటరాజోలో (1,5– a) క్వినోళినే అనలాగ్స్ ఫర్ ఏంటిమైక్రోబియల్ ఆక్టివిటీ’ అనే అంశంపై డాక్టర్ ఏ.నాగరాజు పర్యవేక్షణలో పరిశోధన పూర్తి చేశారు. మంగళవారం తెయూ ఆర్ట్స్ కళాశాల సెమినార్ హాల్‌లో నిర్వహించిన ఓపెన్ వైవా వోస్‌కు నాందెడ్ ఎస్‌ఆర్‌టీఎం యూనివర్సిటీ ప్రొఫెసర్ ఎస్‌బీ.పట్వారీ ఎక్స్‌టర్నల్ ఎగ్జామినర్‌గా వ్యవహరించారు. పరిశోధకుడిని పలు ప్రశ్నలు అడిగి సమాధానాలు రాబట్టారు. డాక్టరేట్ సాధించిన రాకేశ్‌ను తెయూ వీసీ ప్రొఫెసర్ టి.యాదగిరిరావు, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఎం.యాదగిరి అభినందించారు. కార్యక్రమంలో రసాయన శాస్త్ర విభాగాధిపతి బి.సాయిలు, సైన్స్ డీన్ ప్రొఫెసర్ కె.సంపత్ కుమార్, ప్రిన్సిపల్ ప్రొఫెసర్ జి.రాంబాబు, అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు.
ఖలీల్‌వాడి: ఎస్సై, పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగ నియామకాల కోసం నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలోని అర్హులైన ఎస్సీ నిరుద్యోగ అభ్యర్థులకు ఉచిత శిక్షణ అందించేందుకు స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తున్నట్లు డీడీ జి.రజిత, తెలంగాణ ఎస్సీ స్టడీ సర్కిల్ హానరరీ డైరెక్టర్ దేవిదాస్ సక్పాల్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. డిగ్రీ మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తామని, అభ్యర్థులు దరఖాస్తులతోపాటు వారు దరఖాస్తు చేసిన ఎస్సై, కానిస్టేబుల్ రిజిస్ట్రేషన్ ఫారం తప్పనిసరిగా తీసుకొనిరావాలని సూచించారు. ఎస్సెస్సీ, ఇంటర్మీడియట్, డిగ్రీ, టీసీ, కులం, ఆదాయం, రెండు ఫోటోలు, ఆధార్ కార్డు పత్రాలతో నిజామాబాద్‌లోని ఎస్సీ స్టడీ సర్కిల్‌లో ఈ నెల 30న ఉదయం 10 గంటలకు నేరుగా హాజరుకావాలని తెలిపారు. పూర్తి వివరాలకు 9912227425, 9951199460 నంబర్‌లో సంప్రదించాలని సూచించారు.
ఖలీల్‌వాడి: లెక్చరర్లకు ఫేస్ రికగ్నిషన్ హాజరు తప్పనిసరిగా చేయాలని డీఐఈవో రవికుమార్ పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని కోటగల్లీ బాలికల జూనియర్ కళాశాలను ఆకస్మికంగా మంగళవారం డీఐఈవో తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ గంధం బుద్ధిరాజ్ అధ్యక్షతన జరిగిన అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది సమావేశంలో డీఐఈవో మాట్లాడారు. ప్రతి అధ్యాపకుడు సమయాపాలన పాటిస్తూ ఫేస్ రికగ్నిషన్ హాజరు వేయాలని ఆదేశించారు.


