గూడ్స్ రైలు ఢీకొని ఒకరి మృతి
ఆర్మూర్ టౌన్: ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని మామిడిపల్లి శివారులో గోవింద్‌పేట్ బిడ్జి రైల్వే ట్రాక్ వద్ద గూడ్స్ రైలు ఢీకొని బోచ్కర్ మెగా శ్యామ్(52) అనే వ్యక్తి మృతి చెందాడు. వివరాలు ఇలా ఉన్నాయి. పట్టణంలోని హుస్నాబాద్ కాలనీ చెందిన శ్యామ్ రోజూ మాదిరిగానే బ్రిడ్జ్ కింద రైల్వే ట్రాక్ వద్ద కాలకృత్యాలకు వెళ్లాడు. నిజామాబాద్ నుంచి గోవింద్‌పేట్ వైపు వెళ్తున్న గూడ్స్ రైలు ఢీకొట్టడంతో శ్యామ్ అక్కడిక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న రైల్వే పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు రైల్వే ఎస్సై సాయిరెడ్డి తెలిపారు.
చెరువులో పడి ఒకరు..
రుద్రూర్: మండల కేంద్రానికి చెందిన సిరిగందపు లక్ష్మణ్ (42) అనే వ్యక్తి ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతి చెందాడు. ఇన్‌చార్జి ఎస్సై రాము తెలిపిన వివరాల ప్రకారం.. లక్ష్మణ్ వారం రోజుల క్రితం పిట్టలు పట్టడానికి వెళ్లి తిరిగి రాలేదు. మంగళవారం ఉదయం చెరువులో లక్ష్మణ్ మృతదేహన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పిట్టలు పట్టేందుకు వెళ్లి ప్రమాదవశాత్తు చెరువులో జారి పడి మృతి చెందినట్లు భావిస్తున్నారు. మృతుడికి భార్యా, పిల్లలు లేరు. మృతుడి సోదరుని ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
అనారోగ్యంతో మహిళ ..
ఎల్లారెడ్డి: అనారోగ్యంతో ఓ మహిళ మృతి చెందినట్లు ఎస్సై రాజు మంగళవారం తెలిపారు. ఎల్లారెడ్డి మండలంలోని సోమర్యాగడి తండాకు చెందిన బానోత్ కవిత (26) అనారోగ్యంతో బాధపడుతూ ఎల్లారెడ్డి పట్టణంలోని ప్రయివేటు ఆస్పత్రిలో చేరింది. అనంతరం ఆమె అనారోగ్యం క్షీణించడంతో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఎస్సై తెలిపారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఎల్లారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు పేర్కొన్నారు.
చెరువు కుంటలో పడి యువకుడు..
బోధన్‌రూరల్: బోధన్ మండలం సాలూర గ్రామానికి చెందిన అల్లే రమేశ్ (35) అనే యువకుడు బతుకమ్మ చెరువు కుంటలో పడి మృతి చెందాడు. వివరాలు ఇలా ఉన్నాయి. సోమవారం రాత్రి రమేశ్ కనిపించడం లేదని అతని భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. మంగళవారం ఉదయం చెరువు కుంట వద్ద వడ్లు ఆరబెడుతున్న గ్రామస్తులు నీటిలో మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని బయటికి తీశారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదం నెలకొంది. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు బోధన్ రూరల్ ఎస్సై రాజశేఖర్ తెలిపారు. మృతుడికి కుమారుడు, కుమార్తె ఉన్నారు.


