● తక్షణమే 4 టీఎంసీల నీటిని
విడుదల చేయాలి
● ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి
వేల్పూర్ : జిల్లాలోని చెరువులను నింపేందుకు వెంటనే శ్రీరాంసాగర్ నుంచి 4 టీఎంసీల నీటిని విడుదల చేయాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. వేల్పూర్‌లోని క్యాంప్ కార్యాలయంలో గురువారం ఆయన మీడియా తో మాట్లాడారు. గుత్ప, అలీసాగర్, లక్ష్మి కాలువ లిప్టులను పూర్తి సామర్థ్యంతో నడపకపోతే రైతు ఉద్యమం తప్పదన్నారు. ఎల్‌నినో సాకు ఒక బూట కమని, ఏపీలో లేని కరెంటు కష్టాలు తెలంగాణాలో ఎందుకని ప్రశ్నించారు. నాడు కేసీఆర్ హయాంలో 24 గంటల నిరంతర విద్యుత్ సరఫరా కాగా.. రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ప్రస్తుతం 6 గంటలు కూడా ఇవ్వడం లేదని ఆరోపించారు. కరెంటు లేక ఎండి పోయిన పంటలకు ఎకరానికి రూ.25 వేల నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. విద్యుత్ కొరతకు ఎల్‌నినో ప్రభావం, వర్షాలు లేకపోవడమే కారణమంటూ ప్రభుత్వం కుంటి సాకులు చెబుతోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. జలవిద్యుత్త్ తగ్గినా రాష్ట్రంలో కరెంటు కొరత రాకూడదనే ఉద్దేశంతోనే నాడు కేసీఆర్ ముందు చూపుతో కొత్తగూడెం, భద్రాద్రి, యాదాద్రి వంటి మెగా థర్మల్ విద్యుత్ కేంద్రాలను నిర్మించి అప్పగించారని పేర్కొన్నారు. కేసీఆర్ నిర్మించిన ఽథర్మల్ కేంద్రాలకు బొగ్గు సరఫరా నిలిపివేసి రైతుల పొట్ట కొడుతున్నారని ఆరోపించారు. నెలన్నర రోజులుగా రైతులు సబ్స్టేషన్ల ఎదుట, రోడ్లపై బైఠాయించి కన్నీరు మున్నీరవుతుంటే ప్రభుత్వం పట్టించు కోవడం లేదన్నారు. ప్రజల ఆగ్రహం కట్టలు తెంచుకునేసరికి సమీక్ష పేరుతో అధికారులను సస్పెండ్ చేస్తామంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. రైతాంగ సమస్యలపై జిల్లా ఇన్చార్జి మంత్రిగా చెప్పుకుంటున్న సుదర్శన్‌రెడ్డి, కలెక్టర్ తక్షణమే స్పందించి చర్యలు చేపట్టాలని, లేని పక్షంలో కాంగ్రెస్ ప్రభుత్వ మొండి వైఖరికి నిరసనగా అన్నదాతలతో కలిసి పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమాన్ని నిర్మిస్తామని పేర్కొన్నారు. డీసీసీబీ డైరెక్టర్ శేఖర్‌రెడ్డి, నాయకులు రేగుంట దేవేందర్, కల్లెడ ఏలియా, నాగధర్‌రెడ్డి, బద్దం నర్సారెడ్డి, చౌట్పల్లి రవి, మహేశ్ తదితరులు పాల్గొన్నారు.


