నిజామాబాద్ అర్బన్: జిల్లా కేంద్రంలో ప్రభుత్వ భూముల ఆక్రమణలపై రెవెన్యూ అధికారులు చర్యలు చేపట్టారు. కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశాల మేరకు నగరంలోని ముజాహిద్ నగర్ ప్రాంతంలో 2545 సర్వే నంబర్లో 18 ఎకరాల ప్రభుత్వ భూమి ఉండగా, అందులో 13 గుంటల భూమి కబ్జాకు గురైనట్లు గుర్తించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు రెవెన్యూ అధికారులు గురువారం కబ్జాకు గురైన ప్రాంతాన్ని సందర్శించారు. సర్వే నిర్వహించి 13 గుంటల ప్రభుత్వ భూమి కబ్జా అయినట్లు నిర్ధారించారు. ఈ మేరకు రెవెన్యూ, నగర పాలకసంస్థ అధికారుల సమక్షంలో జేసీబీల సహాయంతో ఆక్రమణలను కూల్చివేశారు.
ఉపేక్షించేది లేదు..
ప్రభుత్వ భూముల కబ్జాలను ఉపేక్షింబోమని కలెక్టర్ ఇలాత్రిపాఠి స్పష్టం చేశారు. ప్రభుత్వ స్థలాల ఆక్రమణలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం కాకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ స్థలాల పరిరక్షణ కోసం ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని, ఎక్కడైనా కబ్జాలు జరిగినట్లు గుర్తిస్తే తక్షణమే ఆక్రమణలను తొలగించి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులకు సూచించారు.


